Kalvakuntla Kavitha: ఎకరాకు రూ.10 వేలు కాదు.. రూ.50 వేలు పరిహారం ఇవ్వాలి: కవిత
ABN , Publish Date - Oct 31 , 2025 | 03:50 PM
కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో వరి రైతులు నష్టపోయారని.. వారికి కూడా పరిహారం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ఎకరాకు రూ. 10 వేలు కాకుండా ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాదాపు చేతికొచ్చిన పంటను రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పుడు పంట కోసిన కూడా 25 శాతం వచ్చే పరిస్థితి లేదన్నారు.
కరీంనగర్, అక్టోబర్ 31: తెలంగాణలో భారీ వర్షాలకు పంటనష్ట పోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేలు కాకుండా.. ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో కొట్టుకుపోయిన కల్వల మత్తడిని శుక్రవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. కల్వల మత్తడి కొట్టుకుపోయి 3 ఏళ్ళు అవుతోందని.. దీని రిపేర్ కోసం గత ప్రభుత్వమే రూ. 70 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చిందని, కానీ తర్వాత ప్రభుత్వం మారటంతో పనులు జరగటం లేదన్నారు. ఈ మత్తడిని రిపేర్ చేయించాలని హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గ ఇద్దరు ఎమ్మెల్యేలను కోరుతున్నట్లు తెలిపారు. 6 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్ట్‌పై వందలాది రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు. గతంలో ఇచ్చిన రూ. 70 కోట్ల జీవో ను పాస్ చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు సంబంధం లేకుండా రైతుల బాగు కోసం మత్తడి పనులను తొందరగా పూర్తి చేయాలన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదు అనే మాటను నిజం చేయాలంటే రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. గతంలో కట్ట తెగినప్పుడు అప్పటి ప్రజాప్రతినిధులు స్పందించి తొందరగా దీన్ని పూర్తి చేశారని.. అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా మత్తడిని పునరుద్ధరించాలని కోరారు.
మొంథా తుపాను కారణంగా తెలంగాణ మొత్తం రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్, ఖమ్మం రైతులకు మాత్రమే ఎకరాకు రూ. 10 వేలు ఇస్తామన్నట్లుగా విన్నామని చెప్పారు. శంకరపట్నంలో కూడా వరి రైతులు నష్టపోయారని.. వారికి కూడా పరిహారం ఇవ్వాలన్నారు. ఎకరాకు రూ. 10 వేలు కాకుండా ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాదాపు చేతికొచ్చిన పంటను రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పుడు పంట కోసిన కూడా 25 శాతం వచ్చే పరిస్థితి లేదన్నారు.
అందుకే ప్రభుత్వం రైతుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ చొరవ చూపి అధికారులను ఫీల్డ్ కు పంపించి పంట నష్టం లెక్కలు తీయాలన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కేంద్రం తరఫున రైతులకు పంట నష్టం పరిహారం ఇప్పించాలని కోరారు. కల్వల మత్తడి రిపేర్ కోసం ముఖ్యమంత్రితో ఎంపీ మాట్లాడాలన్నారు. అటు ఈ ప్రాజెక్ట్ మీదనే దాదాపు 180 ముదిరాజ్ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని.. వారికి ఇదే జీవనాధారమని చెప్పారు. వెంటనే మత్తడి బాగు చేయించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
Mahesh Kumar Goud: కిషన్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ సవాల్..
Kishan Reddy Sardar Patel: సర్దార్ స్ఫూర్తితోనే మోడీ ముందడుగు: కిషన్ రెడ్డి