Jagga Reddy: సోనియా, రాహుల్‌ను కలిసినప్పుడు.. కాంగ్రెస్.. థర్డ్ క్లాస్ అనిపించలేదా?
ABN , Publish Date - Aug 23 , 2025 | 05:24 AM
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్.. నీకు చిల్లర పార్టీ అయిందా? రాష్ట్రం ఇచ్చిన తర్వాత.. కుటుంబ సమేతంగా ఢిల్లీకి వెళ్లి సోనియా, రాహుల్‌ను కలిశారు కాదా.. అప్పుడు కాంగ్రెస్ థర్డ్ క్లాస్ పార్టీ అనిపించలేదా
మీ నాన్న.. కాంగ్రెస్ నుంచే కదా వచ్చింది?.. ఆయనా థర్డ్ క్లాసేనా? మరి నువ్వు ఏ క్లాసు?
తెలంగాణ రాకుంటే.. నువ్వు అమెరికా వెళ్లేటోడివి.. నీ తాత బతికుంటే.. కాంగ్రె్‌సను తిట్టినందుకు కొట్టేటోడు... కేటీఆర్‌పై జగ్గారెడ్డి ధ్వజం
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మంచోడే.. కానీ స్ర్కిప్టు రీడర్.. యూరియా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది
సంగారెడ్డి ప్రజలకు మంజీరా నీటి కోసం సచివాలయంలో సమీక్ష చేశా.. బీఆర్‌ఎస్ వాళ్ల లాగా దందాల కోసం కాదు: జగ్గారెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్.. నీకు చిల్లర పార్టీ అయిందా? రాష్ట్రం ఇచ్చిన తర్వాత.. కుటుంబ సమేతంగా ఢిల్లీకి వెళ్లి సోనియా, రాహుల్‌ను కలిశారు కాదా.. అప్పుడు కాంగ్రెస్ థర్డ్ క్లాస్ పార్టీ అనిపించలేదా? కేసీఆర్ రాజకీయ పాఠాలు నేర్చుకుందీ.. కాంగ్రె్‌సలోనే కదా? అలాంటప్పుడు కేసీఆర్ కూడా థర్డ్ క్లాసేనా? మరి నీది ఏ క్లాసు?’’ అంటూ కేటీఆర్‌పై టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందంటూ నాడు నిండు అసెంబ్లీలో కేసీఆరే చెప్పారని గుర్తు చేశారు. ‘‘ఇవాళ కేసీఆర్ కుటుంబం ఇంతగా వెలిగిపోతుందంటే.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్సే కారణం. దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రె్‌సను.. థర్డ్ క్లాస్ పార్టీ అనడానికి కేటీఆర్‌కు మనసు ఎలా వచ్చింది? కాంగ్రెస్ ఏంటన్నది ఆయన కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవాలి. సోనియా తెలంగాణ ఇవ్వకుంటే అమెరికాలో జీతం రాళ్లపైనే కేటీఆర్ బతకాల్సి వచ్చేది. తెలంగాణ బిడ్డ అయిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా పెడితే.. ఆయనకు మద్దతు ఇచ్చి ఓటేయాల్సింది పోయి.. ఉల్టా కాంగ్రె్‌సపైనే ఆరోపణలు చేస్తారా? కేటీఆర్, కేసీఆర్ అవకాశవాద రాజకీయానికి ఇది పరాకాష్ట. పదేళ్లు మంత్రిగా పని చేసినా కేటీఆర్‌కు రాజకీయ జ్ఞానం లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై తొందరపడి మాట్లాడి కిషన్‌రెడ్డికి అవకాశం ఇచ్చాడు.
కేటీఆర్ తాత, నాయనమ్మ బతికుంటే.. కాంగ్రె్‌సను తిడుతున్నందుకు ఆయన చెంప మీద కొట్టేవాళ్లు. కాంగ్రెస్ అంటే త్యాగాల పార్టీ అని చెప్పి.. బుద్ధి చెప్పి ఉండేటోళ్లు’’ అని వ్యాఖ్యానించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన దీక్షంతా కాంగ్రెస్ డిజైన్ చేసిందేనని జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణ వచ్చాక ప్రజలకు ఏ మేరకు లాభం జరిగిందో తెలియదు కానీ.. కేసీఆర్ కుటుంబం మాత్రం లాభపడిందని దుయ్యబట్టారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సౌమ్యుడు.. మంచోడని, అయితే ఆయన ఇంకా స్ర్కిప్ట్ రీడరేనని ఎద్దేవా చేశారు. కోటా మేరకు యూరియా ఇవ్వకుండా కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తోందని దుయ్యబట్టారు. రైతులకు రూ.వేల కోట్లు ఇస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి.. కేంద్రం యూరియా ఇస్తే రైతులకు ఇవ్వడానికి ఇబ్బంది ఉంటదా? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలు, కుతంత్రాలను రైతులు అర్థం చేసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్, వ్యవసాయ మంత్రి తుమ్మల రైతులకు యూరియా అందించే పనిలోనే ఉన్నారని తెలిపారు. ‘‘సచివాలయంలో నేను సమీక్ష నిర్వహించానంటూ బీఆర్‌ఎస్ మాట్లాడుతోంది. సచివాలయంలో వాళ్ల లాగా దందాలు చేస్తే తప్పు కానీ.. ప్రజల కోసం సమీక్ష చేస్తే తప్పేంటి? సంగారెడ్డి ప్రజలకు మంజీరా నీటి కోసం సమీక్ష చేశా.. మళ్లీ కూడా చేస్తా’’ అని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా తాను మొగోడిలా ఉంటానని వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి
లైసెన్సు తీసుకున్న కేబుల్ తప్ప ఏవీ ఉంచొద్దు... హైకోర్టు కీలక ఆదేశాలు
Read Latest Telangana News and National News