Jagga Reddy: దేవుడంటేనే ధర్మం.. ధర్మం అంటేనే ఒకరికి సాయపడటం
ABN , Publish Date - Jan 25 , 2025 | 04:15 AM
నిత్యం పొలిటికల్ పంచ్‌లతో తనదైన శైలిలో విరుచుకుపడే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి ఈ సారి దేవుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇది దేవుడికి ఇష్టం
దేవుడు ఉన్నాడంటేనే మనం బతుకుతున్నాం
లేడనుకుంటే ఒక్క సెకను కూడా బతకలేం
ధర్మం అంటే మతం కాదు.. మానవత్వం, పరోపకారం
దేవుడు అనేది అదొక ధైర్యం.. విశ్వాసం.. నమ్మకం
ఒకరికి సాయం చేయాలని దేవుడు కోరుకుంటాడు
నేను దేవున్ని నమ్ముతానా.. లేదా?..
భక్తి ఉందా.. లేదా? అనే చర్చకు పోను
శ్రీశీశ్రీ మాధవానంద సరస్వతి స్వామిజీ సమక్షంలో
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సంగారెడ్డి రూరల్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): నిత్యం పొలిటికల్ పంచ్‌లతో తనదైన శైలిలో విరుచుకుపడే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి ఈ సారి దేవుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామిజీ సమక్షంలో భజన గీతా లు ఆలపించిన అనంతరం దేవుడు ధర్మం అనే అంశాలపై తన మనసులో మాటను బయటపెట్టారు. ‘దేవుడంటేనే ధర్మం అని.. ధర్మం అంటే మతం కాదని.. తన దృష్టిలో ధర్మం అంటే దానం, మానవత్వం’ అని జగ్గారెడ్డి అన్నారు. తాను దేవుడిని నమ్ముతానా.. లేదా? తనకు భక్తి ఉందా లేదా? అనే చర్చకు పోను అని అంటూనే దేవుడిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి ఆకట్టుకున్నారు.
ఈ సృష్టిలో భగవంతుడు ఉన్నాడంటేనే మనం బతుకుతున్నాం.. లేడనుకుంటే ఒక్క సెకను కూడా బతకలేం అని అన్నారు. దేవుడు అంటే ధైర్యం, విశ్వాసం, నమ్మకమని వ్యాఖ్యానించారు. కాగా ధర్మమంటే తన దృష్టి లో దానమని చెప్పిన జగ్గారెడ్డి.. ఇంకేమైనా అర్థాలు ఉంటాయో తెలపాలని మాధవానంద సరస్వతి స్వామిజీని కోరారు. దీనికి స్వామిజీ స్పందిస్తూ.. జగ్గారెడ్డి తనకు పరీక్ష పెట్టారని.. దానం, పరోపకారం, దయ, మైత్రి, ప్రేమ అన్నీ ధర్మంలో భాగాలేనని చెప్పారు. దేవుడిని నమ్ముతానా లేదా అని వ్యాఖ్యానించి న జగ్గారెడ్డిలో సంపూర్ణమైన దైవభక్తితో పాటు దానగుణం ఉందని చెప్పారు.