Share News

Jagga Reddy: వచ్చే ఎన్నికల్లో 300 ఎంపీ సీట్లతో ప్రజలు రాహుల్‌ను ప్రధానిని చేస్తారు

ABN , Publish Date - Feb 15 , 2025 | 04:26 AM

వచ్చే ఎన్నికల్లో దేశ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి 300 ఎంపీ సీట్లు ఇచ్చి.. రాహుల్‌గాంధీని ప్రధానిని చేస్తారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Jagga Reddy: వచ్చే ఎన్నికల్లో 300 ఎంపీ సీట్లతో ప్రజలు రాహుల్‌ను ప్రధానిని చేస్తారు

  • తెలంగాణ బీజేపీ ఎంపీలూ.. హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ తీసుకురండి

  • యూపీఏ హయాంలో ఐఐటీ మంజూరు

  • అప్పుడు నాకు ఐఐటీ ఫుల్‌ ఫామ్‌ తెలియదు

  • దాన్ని సంగారెడ్డిలో పెట్టాలనుకుంటున్నట్లు వైఎ్‌సఆర్‌ చెప్పారు

  • ప్రకటన పది రోజులు ఆపుతా.. చుట్టూతా భూమి కొనుక్కోమనీ చెప్పారు

  • లేదు.. వెంటనే ప్రకటించాలని కోరా

  • రఘునందన్‌.. నువ్వు డిక్షనరీ చదివినవ్‌

  • నేను జీవితాన్ని చదివిన: తూర్పు జగ్గారెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో దేశ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి 300 ఎంపీ సీట్లు ఇచ్చి.. రాహుల్‌గాంధీని ప్రధానిని చేస్తారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్లలో హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ తీసుకురావాలంటూ తెలంగా ణ బీజేపీ ఎంపీలకు సూచించారు. వారు తేలే ని పక్షంలో రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యాక తానే అడిగి తీసుకువస్తానన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ తాను బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అంత చదువుకోలేదని, ఐటీఐఆర్‌ ఫుల్‌ ఫామ్‌ కూడా తనకు తెలియదన్నారు. కానీ ఐటీఐఆర్‌ వల్ల రాష్ట్రానికి కలిగే లాభం మాత్రం తెలుసునన్నారు. ‘‘యూపీఏ హయాంలో తెలంగాణకు ఐఐటీ మంజూరైంది. దాన్ని హైదరాబాద్‌ పరిసర ప్రాంతా ల్లో పెట్టాలంటున్నారంటూ అప్పటి సీఎం వైఎ్‌సఆర్‌.. నన్ను అసెంబ్లీలోని తన చాంబర్‌కు పిలిపించుకుని చెప్పారు. మంజూరైన ఐఐటీని సంగారెడ్డిలో పెట్టాలనుకుంటున్నాననీ అన్నారు. వా స్తవానికి ఆ రోజున నాకు ఐఐటీ అంటే ఏంటో తెలియదు. కానీ సీఎం అడిగాడంటే ప్రధానమైందని అని భావించి వెంటనే ఓకే చెప్పా’’ అని వెల్లడించా రు. నాడు బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న తన కు.. కందిలో ఐఐటీ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.


ఆనాడు వైఎ్‌సఆర్‌ చెప్పింది వినుంటే..!

సంగారెడ్డిలో ఐఐటీ పెట్టాలనుకుంటున్నట్లు చెప్పి న వైఎ్‌సఆర్‌.. ప్రకటన పది రోజులు ఆపుతాను.. చుట్టు పక్కల భూములు ఏమైనా కొనుక్కుంటావా అంటూ పెద్ద మనసుతో తనను అడిగారని జగ్గారెడ్డి వెల్లడించారు. ఇప్పుడు భూములు కొనుక్కుంటే ప్రకటన తర్వాత వాటి ధరలు పెరుగుతాయనీ ఆయన చెప్పారన్నారు. అయితే అప్పటికే ఐఐటీని హైదరాద్‌లోనే పెట్టాలంటూ కొందరు నేతలు ఆయనపై ఒత్తిడీ పెడుతున్నారని తెలిపారు. దాంతో ప్రకటన ఆపొద్దని, వెంటనే అసెంబ్లీలో ప్రకటించాలని ఆయనను కోరానన్నారు. అదే రోజున ఆయన అసెంబ్లీలో ప్రకటించారని చెప్పారు. అప్పట్లో కందిలో ఎకరా భూమి కేవలం రూ.5 లక్షలు మాత్రమే ఉండేదని, ఐఐటీ రావడం వల్ల అక్కడ ప్రస్తుతం ఎకరా రూ.5 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకూ పలుకుతోందని తెలిపారు.


ఆనాడు వైఎ్‌సఆర్‌ తనను అడిగినప్పుడు ఐఐటీ ఫుల్‌ ఫామ్‌ గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే కందిలో ఐఐటీ వచ్చుండేదే కాదన్నారు. ‘‘సంగారెడ్డికి నేను ఐఐటీని తీసుకువచ్చాను.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 లక్షల ఉద్యోగాలు వచ్చే ఐటీఐఆర్‌ను హైదరాబాద్‌కు మీరు ఎప్పుడు తెస్తరని అడిగితే.. ఐటీఐఆర్‌ ఫుల్‌ ఫామ్‌ అడుగుతవా? ఉత్తమాటలు కాదు..! హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను తీసుకువచ్చి.. నువ్వు, కిషన్‌ రెడ్డి నవ్వండి’’ అంటూ ఎంపీ రఘునందన్‌రావుపై ధ్వజమెత్తారు. ఈ నాలుగేళ్లలో బీజేపీ ఎంపీలు హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ తెస్తరో తేరో అన్నది తేలుతదని, రాహుల్‌ ప్రధాని అయ్యాక తీసుకువచ్చేందుకు తాను ప్రయత్నిస్తానని చెప్పారు. ఒకవేళ బీజేపీ తెలంగాణ ఎంపీలే ఐటీఐఆర్‌ తీసుకొస్తే వారికి శాలువా కప్పి సన్మానిస్తానన్నారు. రఘునందన్‌లాగా తాను లా పుస్తకాలు చదవలేదని, కానీ ప్రజల మనస్తత్వం చదివి.. వారి అవసరాలను గుర్తించానన్నారు. రఘునందన్‌కు చదువు అహంకారాన్ని నేర్పిందని ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - Feb 15 , 2025 | 04:26 AM