Ralampadu Reservoir: డిజైన్ ఆధారంగా నిర్మాణం జరగలేదు!
ABN , Publish Date - Jun 01 , 2025 | 04:32 AM
జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని రేలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను డిజైన్లు/డ్రాయింగ్‌ల ప్రకారం నిర్మించలేదని కేంద్ర జల, విద్యుత్ పరిశోధన కేంద్రం (సీడబ్లూపీఆర్‌ఎస్) నిగ్గుతేల్చింది.
రేలంపాడు రిజర్వాయర్‌పై సీడబ్ల్యూపీఆర్‌ఎస్ సంచలన నివేదిక
హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని రేలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను డిజైన్లు/డ్రాయింగ్‌ల ప్రకారం నిర్మించలేదని కేంద్ర జల, విద్యుత్ పరిశోధన కేంద్రం (సీడబ్లూపీఆర్‌ఎస్) నిగ్గుతేల్చింది. మట్టికట్ట నిర్మాణంలో మట్టే అత్యంత కీలకమైనప్పటికీ.. రిజర్వాయర్ నిర్మాణంలో ఒకే రకమైన మట్టిని వినియోగించారని, కట్టకు గుండెకాయలాంటి హార్టింగ్‌జోన్ మధ్యభాగంలో సీపేజీని (లీకేజీని) అడ్డుకునే బంకమట్టిని తక్కువ మోతాదులో వాడారని తెలిపింది. అందువల్లే కట్ట నుంచి సీపేజీ జరుగుతోందని పేర్కొంది. ఏప్రిల్ 10వ తేదీన రేలంపాడుతోపాటు ముచ్చునోనిపల్లి రిజర్వాయర్లను పరిశీలించిన సీడబ్ల్యూపీఆర్‌ఎస్.. సీపేజీ తగ్గించటానికి పలు సిఫారసులు చేసింది.
జియోమెంబ్రైన్ చేయాలన్నా, కర్టైన్ గ్రౌటింగ్ చేయాలన్నా తగిన పరీక్షలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. హార్టింగ్‌జోన్ పైనుంచి ఉన్న శాండ్ ఇంక్లైన్ ఫిల్టర్ కూడా సరిగా లేదని, శాండ్ ఫిల్టర్ నుంచి నీళ్లు పోవడం లేదని తెలిపింది. ఆ నీరంతా కట్ట మధ్య భాగం నుంచి సీపేజీ రూపంలో వెళ్తుందని గుర్తించింది. కట్టకు వెనకభాగంలో రక్షణగా రెండు బర్మ్‌లు మాత్రమే ఉన్నాయని, మూడో బర్మ్ లేకపోవడంతో కట్టను నిలబెట్టే వ్యవస్థ సరిగ్గా లేకుండా పోయిందని తేల్చింది. కట్టలో ఎప్పటికప్పుడు జరిగే మార్పుల వివరాలను పరిశీలించే ఇన్‌స్ట్రుమెంట్ వ్యవస్థ లేదని, దీనిని కచ్చితంగా ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. సీడబ్లూపీఆర్‌ఎస్ ఇతర సిఫారసులు ఇలా ఉన్నాయి.
కట్టలో భూసాంకేతిక (జియో టెక్నికల్) సీపేజీ అధ్యయనాలు జరగాలి. సీపేజీని కచ్చితంగా అంచనా వేయడానికి న్యుమరికల్ మోడలింగ్ విధానంలో వీటిని నిర్వహించాలి.
కట్ట లోపలి భాగంలో ఏమైనా ఖాళీ ప్రదేశాలు ఉన్నాయా అన్నది పరిశీలించటానికి 2డీ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఇమేజింగ్ పరీక్షలు జరపాలి.
కట్ట నుంచి నీరు ఏయే మార్గాల్లో సీపేజీ రూపంలో బయటికి వస్తుందో గుర్తించడానికి ట్రేసర్ స్టడీస్ చేయాలి.
డ్యామ్ బ్రేక్ ఎనాలిసిస్ పరీక్షలు జరపాలి. బ్యారేజీ దిగువ ప్రాంతంలో వరద మ్యాపింగ్ కోసం అత్యవసర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి ఈ పరీక్షలు అవసరం. సిఫారసు చేసిన ఈ పరీక్షలన్నింటినీ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని ముచ్చునోనిపల్లి రిజర్వాయర్‌లో చేయాల్సి ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News