Registration Issues: నర్సింగ్ రిజిస్ట్రేషన్లలో దోపిడీ?
ABN , Publish Date - Jan 02 , 2025 | 04:26 AM
తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవడం సమస్యగా మారుతోంది. రిజిస్ట్రేషన్లు రెన్యువల్స్ కోసం అభ్యర్థులు కౌన్సిల్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు.
జిరాక్స్ సెంటర్లకు ఆన్‌లైన్ ప్రక్రియ అప్పగింత.. గత కొన్నేళ్లుగా దోచుకుంటున్న వైనం
కౌన్సిల్ చేయాల్సిన పనిని బయటవారికి అప్పగింత
అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్న కౌన్సిల్
తిప్పించుకుంటున్న వైనం
అడిగితే కనీస మర్యాదలేకుండా మాట్లాడుతున్న సిబ్బంది
హైదరాబాద్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవడం సమస్యగా మారుతోంది. రిజిస్ట్రేషన్లు రెన్యువల్స్ కోసం అభ్యర్థులు కౌన్సిల్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. వివరాలు అడిగితే కౌన్సిల్ సిబ్బంది కనీస మర్యాద లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పైకి కనబడని దోపిడీ పర్వం అక్కడ కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీఎన్‌ఎమ్ (జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ), బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ కోర్సులు పూర్తి చేసుకున్నవారు విధిగా నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ప్రక్రియకు అంతకంటే ముందు ఎన్‌యూఐడీ (నర్స్ యూనిక్ ఐడింటిఫికేషన్ నంబరు) కార్డు ఉండాలి. అందుకోసం అభ్యర్థులంతా విఽధిగా నర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ (ఎన్‌ఆర్‌టీఎ్‌స) వెబ్‌సైట్‌లో నమోదు చేసుకొని, ఎన్‌యూఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎన్‌యూఐడీ కార్డును ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అమల్లోకి తీసుకొచ్చింది. నర్స్ కోర్సులు చేసిన ప్రతి ఒక్కరూ విధిగా ఈ నర్స్ ప్రత్యేక గుర్తింపు సంఖ్య కార్డును పొందాలి. అప్పుడే వారు చేసిన కోర్సులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కానీ రెన్యువల్స్ కానీ అవుతాయి.
నర్సింగ్ కౌన్సిల్‌కు వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు విధిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఆ తర్వాతే ఎన్‌యూఐడీ, రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయాలి. ప్రస్తుతం నర్సింగ్ కౌన్సిల్‌కు పక్కనే ఉన్న మెడికల్ కౌన్సిల్ తమ దగ్గరకు వచ్చే వైద్యుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆన్‌లైన్ చేస్తుంది. వారి దగ్గర ఫీజు ఆన్‌లైన్ ద్వారా తీసుకుంటూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తుంది. సరిగ్గా నర్సింగ్ కౌన్సిల్ కూడా అలాగే చేయాలి. కానీ కౌన్సిల్ పక్కనే ఒక జిరాక్స్ సెంటర్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ముందుచేయాల్సిన ఆన్‌లైన్ ప్రాసెస్ అంతా జిరాక్స్ సెంటర్ వద్దనే చేస్తారని, అక్కడకు వెళ్లాలని ప్రతి ఒక్కరికి నర్సింగ్ కౌన్సిల్ సిబ్బంది చెప్పి పంపుతున్నారు. అక్కడకు వెళ్లిన తర్వాత ఆన్‌లైన్ ప్రాసెస్ పూర్తి చేశాక, క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చెల్లించాలని జిరాక్స్ సెంటర్ వాళ్లు చెబుతున్నారు. తీరా పేమెంట్ చేశాక కొన్నిసార్లు అది నర్సింగ్ కౌన్సిల్‌కు చేరడం లేదు. ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో తెలియడం లేదు. ఈ వ్యవహరంపై సమగ్ర విచారణ జరపాలని నర్స్‌లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే నర్సింగ్ కౌన్సిల్‌లో దశాబ్ద కాలంగా పాతుకుపోయిన ఉన్నతాధికారుల నుంచి సిబ్బంది వరకు అందర్నీ బదిలీ చేయాలని నర్స్‌లు డిమాండ్ చేస్తున్నారు.
ఎన్‌యూఐడీ కార్డు కోసం 3నెలలుగా తిరుగుతున్నా
నేను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిజేస్తున్నా. ఎన్‌యూఐడీ కార్డు కోసం మూడు నెలలుగా తిరుగుతున్నా. ఇక్కడి సిబ్బంది, ఉన్నతాధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వివరాలడిగితే విసుక్కుంటున్నారు. మళ్లీమళ్లీ అడిగితే చాలా నిర్లక్ష్యంగా, మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు.
-ఓ నర్స్ అభ్యర్థిని, ప్రైవేటు ఆస్పత్రి, హైదరాబాద్
రిజిస్ట్రేషన్ కోసం ఇంకెన్నిసార్లు రావాలో..
నా నర్సింగ్ రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికి ఐదుసార్లు వచ్చాను. ఇంకెన్నిసార్లు రావాలో అర్థంకావడం లేదు. ఇక్కడ కనీస సమాచారం ఇవ్వడం లేదు. రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికే రూ.వెయ్యి చెల్లించాను. సర్వర్ సమస్య వల్ల కౌన్సిల్‌కు రాలేదని చెబుతున్నారు. మళ్లీ డబ్బులు కట్టాలంటున్నారు. ఆ డబ్బులు తిరిగి నా బ్యాంకు ఖాతాకు జమకాలేదు.
- మరో నర్స్, ఉమ్మడి ఖమ్మం జిల్లా