Share News

Kunneneni Sambasivarao: జైళ్లలో ఉండాల్సినవారు చట్టసభల్లో ఉంటున్నారు

ABN , Publish Date - Jun 30 , 2025 | 06:39 AM

జైళ్లలో ఉండాల్సినవారు చట్టసభల్లో ఉంటున్నారని, చట్టసభల్లో ఉండాల్సిన వారు జైళ్లలో ఉంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

Kunneneni Sambasivarao: జైళ్లలో ఉండాల్సినవారు చట్టసభల్లో ఉంటున్నారు

  • దేశంలో అత్యంత ప్రమాదకరమైన పార్టీ బీజేపీ

  • టీవీ కార్యాలయాలపై దాడులు సరికాదు: కూనంనేని

నేలకొండపల్లి, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): జైళ్లలో ఉండాల్సినవారు చట్టసభల్లో ఉంటున్నారని, చట్టసభల్లో ఉండాల్సిన వారు జైళ్లలో ఉంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మూటాపురంలో ఆదివారం జరిగిన సీపీఐ 17వ మండల మహాసభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. దేశంలో అత్యంత ప్రమాదకరమైన పార్టీ బీజేపీ అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆ పార్టీ పాత్ర శూన్యమని చెప్పారు. తెలంగాణలో గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, అందువల్ల అభివృద్ధి, సంక్షేమం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఫోన్‌ ట్యాపింగ్‌పై వార్తలు ప్రచురిస్తున్నందుకు పాత్రికేయులు, టీవీ కార్యాలయాలపై దాడులు చేయడం సరికాదన్నారు.


కేటీఆర్‌పై కేసు వేస్తే రాష్ట్రం అల్లకల్లోలం కావాలని, శాంతి భద్రతలు ఉండకూడదని చూస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ఏవైనా లోపాలుంటే శాంతియుతంగా ఆందోళన చేయవచ్చని సూచించారు. రాష్ట్రంలో పాలన సజావుగానే సాగుతున్నా.. హామీలను అమలు చేయడంలో కొంత జాప్యం జరుగుతోందన్నారు. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో మావోయిస్టులను చంపడానికి కేంద్రం ప్రయత్నం చేయడమంటే ప్రశ్నించే ప్రతి వ్యక్తిని, ప్రశ్నించే ప్రతి కమ్యూనిస్టును చంపుతున్నట్లేనని పేర్కొన్నారు. మావోయిస్టులు కూడా ఆలోచించి జనజీవన స్రవంతిలో కలవాలని కోరుతున్నామని ఆయన అన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 06:39 AM