Illegal Constructions: రూ. 300 కోట్ల భూమి హాంఫట్
ABN , Publish Date - May 04 , 2025 | 03:17 AM
బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో రూ.300 కోట్ల విలువైన మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని పలువురు బడాబాబులు అక్రమంగా ఆక్రమించారు. పదేళ్లుగా పట్టించుకోని అధికారులు తాజాగా చర్యలు చేపట్టి, అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు
హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన బడాబాబులు.. మూడు ఎకరాల్లోనిర్మాణాలు
పదేళ్లుగా పట్టించుకోని అధికారులు..
తాజాగా రంగంలోకి కూల్చివేతలు చేపడుతూ సరిహద్దుల గుర్తింపు
బెదిరిస్తూ అడ్డుకుంటున్న బడాబాబుల అనుచరులు
బంజారాహిల్స్, మే 3 (ఆంధ్రజ్యోతి): అది బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీ.. మాజీ సీఎంలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, రియల్టర్లు, పారిశ్రామికవేత్తలు నివాసం ఉంటున్న అత్యంత ఖరీదైన ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో రూ.300 కోట్ల విలువైన మూడెకరాల ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురైంది. కొందరు బడాబాబులు తమ ఇళ్లకు ఆనుకొని ఉన్న స్థలాన్ని కబ్జా చేసి లాన్‌లు, స్విమ్మింగ్‌పూల్స్, చిన్నపాటి పార్కులు వంటివి ఏర్పాటు చేసుకుంటే.. మరికొందరు నేరుగా పక్కా భవనాలు నిర్మించుకున్నారు. పదేళ్లకుపైగా ఈ ఆక్రమణలు కొనసాగుతున్నా.. రెవెన్యూ యంత్రాంగం ఇటువైపు కన్నెత్తి చూడలేదు. ఎట్టకేలకు ఈ కబ్జాలను గుర్తించిన షేక్‌పేట రెవెన్యూ అధికారులు.. స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. కబ్జాలకు పాల్పడినవారు రెవెన్యూ సిబ్బంది బెదిరించడం, నిర్బంధించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.
హౌసింగ్ సొసైటీల మధ్య ప్రభుత్వ స్థలం..
బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఉండేవి. గత ప్రభుత్వాలు కొన్ని హౌసింగ్ సొసైటీలకు అక్కడ భూములు కేటాయించాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు, అసెంబ్లీలో పనిచేసే అధికారులు, సిబ్బంది కోసం వెంకటేశ్వర హౌసింగ్ సొసైటీకి వంద ఎకరాల భూమి ఇచ్చింది. ఒక్కొక్కరికి 300-400 చదరపు గజాల స్థలం కేటాయించింది. అందులో కొందరు నివాసం ఉండగా.. చాలామంది క్రమంగా అమ్మేసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రిటైర్డ్ అధికారులు, పారిశ్రామికవేత్తలు ఆ ప్లాట్లను కొనుగోలు చేసి భవనాలు నిర్మించుకున్నారు. అయితే ఎమ్మెల్యే కాలనీ, ఏసీబీ కార్యాలయంలో మధ్య సర్వే నంబర్ 102/1 సుమారు 12 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. దాని విలువ సుమారు రూ.1,200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అది తమదంటే తమదంటూ సొసైటీలు కోర్టుల్లో పిటిషన్లు వేశాయి. పలు క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఇటీవల ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో భాగంగా షేక్‌పేట రెవెన్యూ అధికారులు పాత రికార్డులను పరిశీలిస్తుండగా.. హకీంపేట గ్రామం టీఎస్-193 వార్డు పరిధిలోని ఈ 12 ఎకరాల స్థలం ప్రభుత్వానిదేనని తేలింది. దీనితో రంగంలోకి దిగిన అధికారులు గత పదిహేను రోజులుగా ఆ ప్రభుత్వ స్థలం చుట్టూ సరిహద్దుగా బ్లూషీట్‌ల (నీలి రంగు ఫైబర్ రేకులు)ను ఏర్పాటు చేస్తున్నారు. ఏసీబీ క్వార్టర్స్, రోడ్ నంబరు 12 ప్రధాన రోడ్డు వైపు పనులు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే కాలనీ వైపు పనులు చేపట్టాల్సి ఉంది. కానీ అటువైపు మూడు ఎకరాల స్థలం ఆక్రమణకు గురైనట్టు అధికారులు గుర్తించి, రక్షణ చర్యలు చేపట్టారు.
పరిశీలించిన కొద్దీ అక్రమాలే..
ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్న 37 ప్లాట్ల యజమానులు మొదట తమ స్థలంలో నిర్మాణాలు చేసుకున్నారు. తర్వాత ఇంటి వెనకాల ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఒక్కొక్కరూ 300చదరపు గజాల నుంచి 500 చదరపు గజాల వరకు ఆక్రమించి, ప్రహరీ నిర్మించుకున్నారు. లోపల ల్యాన్‌లు, స్విమ్మింగ్ పూల్‌లు ఏర్పాటు చేసుకున్నారు. రెండు ప్లాట్ల యజమానులు పనివారి కోసం పక్కా ఇళ్లు నిర్మించారు. ఓ ప్రైవేటు ఉద్యోగి ఏకంగా మూడంతస్తుల భవనాన్ని నిర్మించారు. అంతే కాదు తన ఇంటి వెనుక మరో మూడు వందల గజాల స్థలంలో లాన్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక రియల్టర్ స్విమ్మింగ్ పూల్, చిన్నపాటి పార్కును ఏర్పాటు చేసుకున్నారు. ఓ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ లాన్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినవారిలో 8 మంది జీవో 59 కింద క్రమబద్ధీకరణ కోసం గతంలోనే దరఖాస్తు చేసుకున్నారు. కానీ క్రమబద్ధీకరణ కాలేదు. మరికొందరు వెంకటేశ్వర సొసైటీకి చెందినవారే తమకు ఆ స్థలాన్ని అమ్మినట్టుగా కాగితాలు సృష్టించారు.
కోర్టు ఆదేశాలున్నా కూల్చివేతలు చేపట్టారు
కోర్టు ఆదేశాలున్నా రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. మాకు 300 గజాల స్థలం ప్రభుత్వం కేటాయించింది. మరో 489 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరించింది. ఇంటి వెనకాల ఉన్న మరో 300 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరించాలని దరఖాస్తు చేసుకున్నాం. ఇంకా ప్రభుత్వ నిర్ణయం వెలువడలేదు. ఈ విషయంపై కోర్టుకు వెళ్లగా ఎవరూ కలుగ చేసుకోవద్దని ఆదేశాలిచ్చింది. కానీ అధికారులు పట్టించుకోకుండా.. మా ఇంటిని అనుకొని బ్లూ షీట్స్ ఏర్పాటు చేశారు.
- కరీముల్లా, విశ్రాంత ఈఎన్‌సీ
37 మంది ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు
ఎమ్మెల్యే కాలనీకి చెందిన 37 మంది మూడెకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్టు మా సర్వేలో తేలింది. ఆ స్థలాన్ని రక్షించేందుకు ప్రహరీ ఏర్పాటు చేస్తున్నాం. కొందరు క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరికొంత మందికి అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్ జరిగినట్టు తెలుస్తోంది. అక్రమాల తొలగింపు విషయంలో మాకు ఎటువంటి కోర్టు ఆదేశాలు అందలేదు. మా విధులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే సహించేది లేదు.
- వై.అనితారెడ్డి, షేక్‌పేట తహసీల్దార్
ప్రభుత్వ సిబ్బందిని బెదిరిస్తుండడంతో..
ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలంలోని నిర్మాణాలను షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి ఆధ్వర్యంలో కూల్చేసి, ప్రభుత్వ స్థలం చుట్టూ సరిహద్దు ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం అలా ఓ భవనం వద్దకు వెళ్లగా.. అక్కడి ప్రైవేటు సిబ్బంది కూల్చివేతలు చేపట్టకుండా అడ్డుకున్నారు. రెవెన్యూ సిబ్బందిని నిర్బంధించి ఫోన్లు లాక్కున్నారు. ఎలాగోలా అధికారులు, సిబ్బంది బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగించారు. ప్రభుత్వ స్థలంలోని బహుళ అంతస్తుల నిర్మాణాన్ని సీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి
Robbery: ఇళ్లు అద్దెకు కావాలంటూ వచ్చి..ఏం చేశారంటే
Pakistan Ceasefire: కశ్మీర్‌లో మళ్లీ కాల్పులు..తొమ్మిదోసారి ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్
Read Latest Telangana News And Telugu News