IB Chief: కర్రెగుట్టల్లో ఐబీ చీఫ్
ABN , Publish Date - May 01 , 2025 | 04:24 AM
ఓవైపు భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. మరోవైపు మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ ఊపందుకుంది.

కూంబింగ్‌ను పరిశీలించిన తపన్ డేకా
అడవుల్లోకి భారీగా తరలుతున్న బలగాలు
చర్ల/వెంకటాపురం, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ఓవైపు భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. మరోవైపు మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ ఊపందుకుంది. బలగాల ఆపరేషన్‌ను స్వయంగా పర్యవేక్షించేందుకు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) చీఫ్ తపన్ డేకా బుధవారం తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్ సరిహద్దుల్లో పర్యటించారు. మావోయిస్టుల కంచుకోటలో పాగా వేసిన బలగాలను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. మంగళవారమే ఆయన ఛత్తీ్‌సగఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు చేరుకోగా.. సాయంత్రం పోలీసు ఉన్నతాధికారులు, సీఆర్‌పీఎఫ్ అధికారులతో భేటీ అయినట్లు తెలిసింది. బుధవారం ఉదయం బస్తర్ రీజియన్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ఆయన.. మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా కర్రెగుట్టలకు చేరుకున్నారు. మావోయిస్టులు, పౌరహక్కుల సంఘాలు శాంతి చర్చలకు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఐబీ చీఫ్ సందర్శన ప్రాధాన్యతను సంతరించుకుంది. అప్పటికే జవాన్లు కర్రెగుట్టల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక క్యాంప్‌ను ఆయన సందర్శించినట్లు సమాచారం.
నిన్నమొన్నటి వరకు మావోయిస్టుల కంచుకోటగా ఉంటూ.. జనతన సర్కార్ పేరుతో గూడేలను పాలించిన ప్రాంతంలో.. బుధవారం తొలిసారి జాతీయ జెండా ఎగిరినట్లు సమాచారం. ఆ జెండాను ఓ జవాన్ తీసుకెళ్తున్న దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం కర్రెగుట్టల్లోని దోబికొండ, నీలం సరాయి గుట్టలు పూర్తిస్థాయిలో బలగాల ఆధీనంలోకి వచ్చినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇంకా 10 వరకు కీలక గుట్టలు, వందల సంఖ్యలో గుహల్లో కూంబింగ్ నిర్వహించాల్సి ఉన్నట్లు వివరించాయి. ‘ఆపరేషన్ కర్రెగుట్టలు’ ప్రారంభమై తొమ్మిది రోజులైనా.. మావోయిస్టులు దుర్గం గుట్టలకు మకాం మార్చారని కేంద్ర బలగాలకు సమాచారం ఉన్నా.. అడపాదడపా బాంబుల మోత మోగుతోందని స్థానికులు చెబుతున్నారు. మరో వారంపది రోజుల్లో కర్రెగుట్టల్లో శాశ్వత బేస్ క్యాంప్‌ను నిర్మించే దిశలో బలగాలు చర్యలు తీసుకుంటున్నాయని సమాచారం. మావోయిస్టు కంచుకోటలను బలగాలు చుట్టుముట్టగానే హక్కుల కార్యకర్తలు శాంతి చర్చలకు పట్టుబడుతున్నారని ఛత్తీ్‌సగఢ్ హోంమంత్రి విజయ్‌శర్మ విమర్శించారు. గతంలో మావోయిస్టులు ఉచ్చుపన్ని బలగాలను మట్టుబెట్టినప్పుడు శాంతి గుర్తుకురాలేదా? అని నిలదీశారు.
Also Read:
BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ
Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..
Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..