Arvind Kumar: కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశాం!
ABN , Publish Date - Jul 04 , 2025 | 03:36 AM
ఫార్ములా ఈ కారు రేసులో విదేశీ కంపెనీ ఫార్ములా ఈ ఆపరేషన్స్‌కు నిధుల చెల్లింపు విషయంలో ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు గురువారం ఆరు గంటల పాటు విచారించారు.
ఎఫ్‌ఈవోకు నిధులు మంజూరు చేయమని ఆయన మెసేజ్ చేశారు
ఆర్థిక శాఖ అనుమతి కావాలని చెబితే.. తానే చూసుకుంటానన్నారు
ఏసీబీ ఎదుట ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ వాంగ్మూలం!
హైదరాబాద్, జూలై3 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ కారు రేసులో విదేశీ కంపెనీ ఫార్ములా ఈ ఆపరేషన్స్‌కు నిధుల చెల్లింపు విషయంలో ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు గురువారం ఆరు గంటల పాటు విచారించారు. ఈ కేసుకు సంబంధించి గతనెల 16న మాజీమంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. అంతకు ముందు నిధుల విడుదలకు సంబంధించి రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చిన హెచ్‌ఎండీఐ మాజీ అధికారి బీఎల్‌ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు విచారించారు. నిధుల విడుదల ఏ విధంగా జరిగింది? ఆదేశాలు ఎవరు ఇచ్చారు? నోట్‌ఫైల్ తయారైన తర్వాత నిధుల విడుదలకు ఆదేశాలు వచ్చాయా? లేదంటే.. ఆదేశాలు వచ్చి నిధుల విడుదల జరిగాక ఫైల్ తయారైందా? అనే కోణంలో అర్వింద్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులను విడుదల చేశామని, ఎఫ్‌ఈవోకు నిధుల విడుదల చేయాలని కేటీఆర్ వాట్సాప్ మేసేజ్ ద్వారా ఆదేశించారని అర్వింద్‌కుమార్ చెప్పినట్లు తెలుస్తోంది. బిజినెస్ రూల్స్ ప్రకారం నిధుల విడుదలకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని తాను.. మంత్రిగా ఉన్న కేటీఆర్‌కు చెప్పానని, ముందు నిధులు విడుదల చేయాలని.. అవన్నీ తాను చూసుకుంటానని కేటీఆర్ అన్నారని అర్వింద్‌కుమార్ ఏసీబీకి వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. రూ.45.71కోట్ల నగదును ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా బ్రిటన్ పౌండ్ల రూపంలో ఎఫ్‌ఈవోకు చెల్లించామని ఆయన వివరించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ విచారణ తర్వాత అర్వింద్‌కుమార్‌నూ ప్రశ్నించడంతో నిధుల విడుదల ఏ విధంగా జరిగిందనే విషయంలో ఏసీబీ అధికారులు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి త్వరలో చార్జీషీటు దాఖలు చేయడానికి ఏసీబీ అధికారులు సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం.