Share News

HYDRAA: హైడ్రా కూల్చివేతలు.. రూ. 139 కోట్ల విలువైన భూమికి విముక్తి

ABN , Publish Date - Oct 15 , 2025 | 12:19 PM

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో కబ్జాలను హైడ్రా బుధవారం తొలగించింది. బద్వేల్ - ఉప్పరపల్లి గ్రామాల్లో జనచైతన్య లేఔట్ ఫేజ్ 1, 2, లలో ఆక్రమణలకు గురైన 4 పార్కులకు విముక్తి కల్పించింది. 19878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకొని ప్రభుత్వ భూమిని కాపాడింది. దీని విలువ రూ. 139 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

HYDRAA: హైడ్రా కూల్చివేతలు.. రూ. 139 కోట్ల విలువైన భూమికి విముక్తి
Hydraa demolitions

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 15: హైదరాబాద్ మహానగరంలోని ప్రభుత్వ భూములను కాపాడటం, అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువులు, కుంటలను కాపాడటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా దూసుకుపోతుంది. తమకు వచ్చిన ఫిర్యాదుల మేరకు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వరంలో అధికారులు పనులను ఎప్పటికప్పుడు వేగవంతం చేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో కబ్జాలను హైడ్రా బుధవారం తొలగించింది.


బద్వేల్ - ఉప్పరపల్లి గ్రామాల్లో జనచైతన్య లేఔట్ ఫేజ్ 1, 2, లలో ఆక్రమణలకు గురైన 4 పార్కులకు విముక్తి కల్పించింది. 19878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకొని ప్రభుత్వ భూమిని కాపాడింది. దీని విలువ రూ. 139 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 120 ఎకరాల్లో ఫేజ్ I &II పేరుతో హుడా అప్రూవల్ తో ఏర్పాటు చేసిన జనచైతన్య లేఔట్ లో పార్కులు కబ్జాకు గురి అవుతున్నాయని ప్రజావాణికి ఫిర్యాదులు అందడంతో హైడ్రా చర్యలు చేపట్టింది.


రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో బద్వేల్ - ఉప్పరపల్లి గ్రామాల్లో పరిశీలించిన అనంతరం కబ్జాలు జరిగినట్టు హైడ్రా నిర్ధారించింది. ఈ మేరకు బుధవారం కబ్జాలను జేసీబీల సహాయంతో తొలగించింది. ప్రహరీలు నిర్మించుకొని వేసిన షెడ్డులను , రూమ్ లను హైడ్రా తొలగించింది. మూడు వేలు, వెయ్యి గజాలు, అయిదు వందల గజాల చొప్పున ఆక్రమించి నిర్మించిన షెడ్డులను కూల్చివేసింది. ఆక్రమణల తొలగింపు తర్వాత వెను వెంటనే ఫెన్సింగ్ నిర్మాణ పనులు చేపట్టింది. భవిష్యత్తులో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.


హైడ్రా ప్ర‌జావాణికి సోమ‌వారం మొత్తం 48 ఫిర్యాదులు అందాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదుల‌ను తాను స్వ‌యంగా ప‌రిశీలించి సంబంధిత అధికారుల‌కు వాటి ప‌రిష్కార బాధ్య‌త‌లు అప్ప‌గించినట్లు పేర్కొన్నారు. 'ప్లాట్ ప‌క్క‌న పార్కు ఉంటే మాయం చేస్తున్నారు. డెడ్ ఎండ్ రోడ్డు ఉంటే క‌బ్జా చేస్తున్నారు. లే ఔట్ స్వ‌రూపాల‌ను మార్చేస్తున్నారు. చెరువుల‌ను క‌లుపుతూ సాగే వ‌ర‌ద కాలువ‌ల‌ను కూడా ఇష్టానుసారం మ‌లుపులు తిప్పుతున్నారు. దీంతో కాల‌నీలు, బ‌స్తీలు నీట మునుగుతున్నాయి' అని ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు.


ర‌హ‌దారుల‌ను ఆక్ర‌మించి వ్యాపారాలు చేస్తుండ‌డంతో ఆ మార్గంలో వెళ్ల‌డానికి ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంద‌ని ప‌లువురు హైడ్రా ఎదుట తమ బాధను వ్యక్తం చేసినట్లు తెలిపారు. శ్మ‌శాన‌వాటిక‌ల‌తో పాటు చెరువుల‌ను చెర‌బ‌డుతున్నార‌ని ప‌లురువు హైడ్రాను ఆశ్ర‌యించినట్లు వివరించారు. రావిర్యాల పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్ కంటే ఎక్కువ నీరు వ‌చ్చి చేర‌డంతో పైన ఉన్న హెచ్ఎండీఏ అనుమ‌తి పొందిన లే ఔట్లు కూడా మునిగిపోతున్నాయ‌ని ఫిర్యాదులు అందినట్లు వివరించారు.


ఇవి కూడా చదవండి:

Hyderabad Teen Tortured: నేరేడ్‌మెట్‌లో దారుణం.. చీకటి గదిలో బంధించి చిత్రహింసలు

Avind Slams KTR: దొంగ ఓట్లు తెచ్చిందే బీఆర్‌ఎస్.. ఎంపీ ఫైర్

Updated Date - Oct 15 , 2025 | 12:19 PM