Women Ministers Vs ponguleti: వరంగల్ పంచాయితీలో బిగ్ ట్విస్ట్.. ఢిల్లీకి చేరిన వివాదం..
ABN , Publish Date - Oct 12 , 2025 | 04:45 PM
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయం మరింత వేడెక్కింది. మంత్రి పొంగులేటిపై ఇప్పటివరకూ కొండా సురేఖనే మండిపడుతున్నారు. తాజాగా ఆ జాబితాలో మరో మంత్రి వచ్చి చేరారు.
హైదరాబాద్, అక్టోబర్ 12: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రుల మధ్య నెలకొన్న పంచాయితీ తాజాగా కీలక మలుపు తిరిగింది. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారశైలిపై పీసీసీకి మహిళా మంత్రులు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ.. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పీసీసీ చీఫ్ ఆదివారం నాడు హైదరాబాద్‌లో స్పందించారు. మంత్రి పొంగులేటిపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తమ ఇంటి సమస్యలను తామే పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు.
మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు కొండా సురేఖ, సీతక్క రేవంత్ రెడ్డి కేబినెట్‌లో కీలక శాఖల మంత్రులుగా ఉన్నారు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం అదే కేబినెట్‌లో అత్యంత కీలక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.
అయితే, తాజాగా మేడారం జాతరకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆయా పనుల టెండర్ల విషయంలో మంత్రుల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ టెండర్లలో అధిక శాతం పనుల టెండర్లను పొంగులేటి తన వర్గానికి ఇప్పించుకున్నట్లు తెలుస్తోంది.
అదీకాక ఇప్పటికే మంత్రి కొండా సురేఖ దంపతులకు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురి ఎమ్మెల్యేలకు మధ్య దూరం భారీగా పెరిగింది. అలాంటి వేళ.. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రితో సైతం విభేదాలు రావడంతో.. ఈ పంచాయితీ కాస్తా ఢిల్లీకి చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పొంగులేటితో కొండా సురేఖకు మాత్రమే విభేదాలు ఉన్నాయనుకుంటే.. తాజాగా ఆ జాబితాలో సీతక్క సైతం చేరడం గమనార్హం. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పై విధంగా స్పందించారు. అయితే, తానెవ్వరి మీదా ఫిర్యాదు చేయలేందటూ మంత్రి సీతక్క ట్విస్ట్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుంటూరు జిల్లాలో మరో పరువు హత్య
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నిలిచిపోనున్న వాటర్ సప్లై..
For More TG News And Telugu News