TSSPDCL CMD: అందుకే కేబుల్స్ కట్ చేయాల్సి వస్తోంది: సీఎండీ
ABN , Publish Date - Aug 21 , 2025 | 02:24 PM
విద్యుత్ షాక్ ఘటనలు సెంట్రల్ హైదరాబాద్ పరిధిలోనే చోటు చేసుకుంటున్నాయని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ విచారం వ్యక్తం చేశారు. విద్యుత్ షాక్‌తో ఏడుగురు చనిపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 21: విద్యుత్ షాక్ ఘటనలు సెంట్రల్ హైదరాబాద్ పరిధిలోనే చోటు చేసుకుంటున్నాయని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ విచారం వ్యక్తం చేశారు. విద్యుత్ షాక్‌తో ఏడుగురు చనిపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో సీఎండీ ముషారప్ అలీ మాట్లాడుతూ.. టీవీ కేబుల్స్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ రెగ్యులర్‌గా కరెంట్ వైర్లకు దగ్గరగా పెట్టడంతో వర్షా కాలంలో ఇబ్బందులు తలెత్తే.. ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ అంశంపై గ్రేటర్ పరిధిలోని కేబుల్ ఆపరేటర్స్‌తో చాల సార్లు సమావేశం ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయినా వాళ్ళు మారడం లేదన్నారు.
అందువల్లే కేబుల్స్ కట్ చేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. టీజీఎస్పీడీసీఎల్ సూచించిన ప్రమాణాల ప్రకారం కేబుల్ వైర్లు, సర్వీస్ ప్రొవైడర్లను వాడడం లేదన్నారు. ప్రస్తుతం వర్ష కాలంలో సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండాలంటూ నగర వాసులకు ఆయన కీలక సూచన చేశారు. కేబుల్స్ కట్ చేయడం వల్ల ఆసుపత్రుల్లో అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయం చూడాలని ఇప్పటికే కేబుల్స్ ఆపరేటర్స్‌కు సూచించామన్నారు. అయితే కేబుల్స్ కట్ చేయడంపై తెలంగాణ హైకోర్టు కొన్ని కీలక సూచనలు చేసింది.. ఆ క్రమంలో కోర్టు వివరణ ఇచ్చిన తర్వాత.. తదుపరి యాక్షన్ ఉంటుందని సీఎండీ ముషారఫ్ అలీ వెల్లడించారు.
కృష్ణాష్టమి సందర్భంగా హైదరాబాద్‌లోని రామాంతాపుర్‌లో భక్తులు యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో కరెంట్ షాక్ తగిలి ఆరుగురు యువకులు మరణించారు. అలాగే మరో ప్రాంతాల్లో కరెంట్ షాక్ తగిలి మరో ఇద్దరు మరణించారు. అలాగే వినాయకుడి విగ్రహం తీసుకు వెళ్తూ మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో విద్యుత్ స్తంభాలకు ఉన్న ఇంటర్నెట్ కేబుళ్లను తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించింది. దీంతో నగరంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ దీపాలకు ఉన్న కేబుల్ వైర్లను తొలగించారు. దీంతో ప్రభుత్వ చర్యలను కేబుల్ ఆపరేటర్లు ఖండించారు. ఆ క్రమంలో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీతో కేబుల్ ఆపరేటర్లు బుధవారం సమావేశమయ్యారు. వీరి మధ్య జరిగిన చర్చలు సఫలమైనట్లు వార్త కథనాలు వెల్లడించిన విషయం విదితమే.