Share News

Minister Uttam kumar: రిపోర్ట్ చూసి నిర్ఘాంతపోయాం

ABN , Publish Date - Aug 10 , 2025 | 08:54 PM

దేవాదుల ప్రాజెక్ట్‌కు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిర్మించడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.

Minister Uttam kumar: రిపోర్ట్ చూసి నిర్ఘాంతపోయాం
Minister Uttam kumar Reddy

ములుగు, ఆగస్ట్ 10: దేవాదుల ప్రాజెక్ట్‌కు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిర్మించడానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. అయితే ఈ ప్రాజక్ట్ కారణంగా.. పొరుగునున్న ఛత్తీస్‌గఢ్‌లో మునిగిపోయే ప్రాంతాలకు పరిహారం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ భూసేకరణకు సంబంధించి.. సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు.


రైతులకు న్యాయబద్దమైన.. మానవీయ కోణంలో ఆలోచించి పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను తమ హయాంలోనే పూర్తి చేస్తామని ప్రకటించారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ అందించిన రిపోర్టును సంక్షిప్తం చేసిన ముగ్గురు అధికారులు కమిషన్ నివేదిక చూసి తాము నిర్ఘాంతపోయామన్నారు. కాళేశ్వరం డిజైన్ చేసింది వారే.. కూలిపోయింది వారి హయంలోనే అంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.


కాళేశ్వరంపై విచారణకు కమిషన్ ఆదేశిస్తే.. గత పాలకుల అవినీతి, అసమర్థత కారణంగానే కూలిపోయిందని చెప్పారని తెలిపారు. ఈ రిపోర్ట్ తాను కానీ.. సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇవ్వలేదని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని మంత్రి ఉత్తమ్ కుండబద్దలు కొట్టారు. ప్రాజెక్ట్ నిర్మించి.. కూల్చి మళ్ళీ మేమే కడతామంటే ఎలా అంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. నీటిని మూడు బ్యారేజీల్లో నిలువ ఉంచ వద్దని ఎన్‌డీఎస్‌ఏ గతంలోనే స్పష్టం చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.


అయినా నీటిని విడుదల చేస్తే గ్రామాలు కొట్టుకు పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము తుమ్మడిహాట్టి ప్రాజెక్ట్ నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. ఇక ఏపీలో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్‌కు తాము పూర్తి వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని కేంద్రానికి స్పష్టం చేశామని ఆయన గుర్తు చేశారు. ఆ క్రమంలో ఈ ప్రాజెక్ట్ అంశంలో తాము చట్టపరంగా.. న్యాయ పరంగా ముందుకు వెళతానని మంత్రి ఉత్తమ్ వివరించారు.

Updated Date - Aug 10 , 2025 | 08:54 PM