Telangana Govt: నేటి నుంచి మరో కొత్త పథకం
ABN , Publish Date - May 29 , 2025 | 07:40 AM
తెలంగాణలోని రేవంత్ సర్కార్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
హైదరాబాద్: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కొత్త పథకానికి నేటి నుంచి శ్రీకారం చుట్టనుంది. బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఇందిరమ్మ అమృతం పథకాన్ని గురువారం నుంచి అమలు చేయనుంది. ‘ఆడపిల్లలకు శక్తినిద్దాం.. ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం’ అనే నినాదంతో ఈ సరికొత్త పథకాన్ని రేవంత్ సర్కార్ తీసుకు వచ్చింది. 14 నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్న అమ్మాయిలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రతి రోజు.. ఒక పల్లీ పట్టితోపాటు చిరుధాన్యాల పట్టీని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అమలు చేయనున్నారు. భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెంలో మంత్రి సీతక్క ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, అనారోగ్య కారణాలతో అత్యధిక సంఖ్యలో బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన సమయంలో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులోభాగంగా ఇందిరమ్మ అమృతం పథకాన్ని రేవంత్ సర్కార్ తీసుకువచ్చింది. పోషకాహారం కింద పల్లీలు, చిరు ధాన్యాలతో తయారైన చిక్కీలను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలికలకు ఉచితంగా పంపిణీ చేయనుంది.
అయితే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం తెలంగాణలో 64.7 శాతం బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఆ క్రమంలో ముందుగా ఈ మూడు జిల్లాల్లో ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టి.. అనంతరం అవసరమైతే మార్పులు చేసి రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ పథకంలో భాగంగా ప్రతి రోజూ ఒకటి చొప్పున నెల రోజులకు 30 చిక్కీలు ఇస్తారు. ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున రెండుసార్లు వీటిని పంపిణీ చేయనున్నారు.
ఒక్కో చిక్కీల సుమారు 600 కేలరీలు.. 18 నుంచి 20 గ్రాముల ప్రొటీన్లతో పాటు సూక్ష పోషకాలు సైతం వీటిలో ఉంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తాం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
For Telangana News And Telugu News