Share News

TG CM Revanth Reddy: పుట్టుకతో ప్రధాని మోదీ ఓబీసీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Jul 24 , 2025 | 06:51 PM

న్యూఢిల్లీలోని ఏఐసీసీ కొత్త కార్యాలయం వేదికగా కుల గణనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలతోపాటు కాంగ్రెస్ ఎంపీలు హాజరయ్యారు.

TG CM Revanth Reddy: పుట్టుకతో ప్రధాని మోదీ ఓబీసీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
TG CM Revanth Reddy

న్యూఢిల్లీ, జులై 24: పుట్టుకతో ప్రధాని నరేంద్ర మోదీ ఓబీసీ కాదని.. ఆయన లీగల్లీ కన్వర్టెడ్‌ ఓబీసీ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఓబీసీల కోసం ప్రధాని మోదీ మనస్ఫూర్తిగా చేసిందేమీ లేదని కుండబద్దలు కొట్టారు. అయితే దేశం కోసం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే త్యాగాలు చేసిందని వివరించారు. గురువారం న్యూఢిల్లీలో కులగణనపై సీఎం రేవంత్‌ రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ మోడల్‌ అంటే ఏమిటో తెలిపేందుకే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇస్తున్నట్లు తెలిపారు.

భారత్‌ జోడో యాత్రలో కులగణనపై రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే కులగణన సర్వే చేశామన్నారు. దేశానికి ఒక దశా దిశను చూపించేలా ఈ కులగణన సర్వే చేపట్టామని ఆయన వివరించారు. దాదాపు వందేళ్ల తర్వాత కులగణన ప్రక్రియ నిర్వహించామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఒత్తిడితోనే దేశవ్యాప్త కులగణనకు కేంద్రం దిగొచ్చిందని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.


తెలంగాణలో కులగణన ఓ చరిత్ర: డిప్యూటీ సీఎం మల్లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కులగణన చేస్తామని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాహుల్‌ హామీ మేరకు రాష్ట్రంలో కులగణన చేపట్టామని వివరించారు. అందుకు తగ్గట్లుగా ఎవరి జనాభా ఎంత అనేది తేల్చామన్నారు. తెలంగాణలో కుల గణన ఓ చరిత్ర అని ఆయన అభివర్ణించారు. కుల గణనతో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. దాదాపు 2 లక్షల మంది సిబ్బందితో 50 రోజుల్లో ఈ సర్వే నిర్వహించామని వివరించారు. తెలంగాణ మొత్తాన్ని బ్లాక్‌లుగా విభజించి సర్వే నిర్వహించామని చెప్పారు.


ఎలాంటి పొరపాట్లు లేకుండా కుల గణన సర్వే చేపట్టామని తెలిపారు. 150 ఇళ్లకు ఒక్కో ఎన్యుమరేటర్‌ను నియమించి ఈ సర్వే చేపట్టామని పేర్కొన్నారు. విస్తృత సంప్రదింపులతో కుల గణన సర్వే సాకారం చేశామన్నారు. కుల గణన సర్వేను తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందని చెప్పారు. అసెంబ్లీ అనుమతితో రిపోర్ట్‌పై నిపుణుల కమిటీ సైతం వేశామని చెప్పారు. నిపుణుల కమిటీ కొన్ని కీలక సూచనలు చేసిందన్నారు. ఈ కమిటీ సూచనలపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.


సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడమే ఎజెండాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. అందులో భాగంగా బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్ బిల్లు అంశాలపై కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. న్యూఢిల్లీలోకి కొత్త ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉభయ సభల సభ్యులు హాజరయ్యారు.


తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అయితే ఈ 42 శాతం రిజర్వేషన్లకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అలాగే ఈ పార్లమెంట్ సమావేశాల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపేలా ఉభయ సభల్లో కాంగ్రెస్ ఎంపీలు ఒత్తిడి చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలతోపాటు కాంగ్రెస్ ఎంపీలంతా దాదాపుగా హాజరయ్యారు.

Updated Date - Jul 24 , 2025 | 09:55 PM