Telangana Police-KTR: కేటీఆర్‌కు ఐపీఎస్ అధికారుల సంఘం వార్నింగ్
ABN , Publish Date - Nov 12 , 2025 | 08:26 PM
పోలీస్ వ్యవస్థపై నిజమైన అభ్యంతరాలు ఉంటే, వాటిని బహిరంగంగా దూషించడం కాకుండా చట్టబద్దంగా లేవనెత్తాలని ఐపీఎస్ అధికారుల సంఘం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు సూచించింది. DGP మీద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన రిలీజ్ చేసింది.
హైదరాబాద్, నవంబర్ 12: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ IPS అధికారుల సంఘం వార్నింగ్ ఇచ్చింది. DGPకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని హెచ్చరించింది. ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో కేటీఆర్ చేసిన అవమానకర వ్యాఖ్యలను తెలంగాణ IPS అధికారుల సంఘం తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది.
దీనికి సంబంధించి ఐపీఎస్ అధికారుల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. DGP శివధర్ రెడ్డి ఇంకా, మొత్తం రాష్ట్ర పోలీసు వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని సంఘం ఆరోపించింది. పోలీస్ వ్యవస్థ పై నిజమైన అభ్యంతరాలు ఉంటే, వాటిని బహిరంగంగా దూషించడం కాకుండా చట్టబద్దంగా లేవనెత్తాలని పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించి, పోలీసుల నిష్పాక్షికత, వృత్తి గౌరవాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నాం.. అంటూ ప్రకటన రిలీజ్ చేసింది.
DGP రాష్ట్ర పోలీసు వ్యవస్థకు అధిపతి అని, అలాంటి వ్యక్తిపై వ్యక్తిగత లేదా పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు సరైనవి కావని పోలీస్ అధికారుల సంఘం తెలిపింది. రాజకీయ ప్రయోజనాల కోసం సర్వీసులో ఉన్న అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం సరైంది కాదని, తెలంగాణ పోలీసులు ఎల్లప్పుడూ చట్టబద్ధంగా పనిచేస్తున్నారని సంఘం తన ప్రకటనలో వెల్లడించింది. రాజ్యాంగ సంస్థలు, సీనియర్ ప్రభుత్వ అధికారుల గౌరవాన్ని ఎల్లప్పుడూ కాపాడాలని సూచించింది.

ఇవీ చదవండి:
మీ చూపు శక్తివంతమైనదైతే.. ఈ ఫొటోలో తోడేలును 9 సెకెన్లలో కనిపెట్టండి..
మీ మిక్సీ జార్ తిరగడం లేదా.. ఈ సూపర్ ట్రిక్ ఉపయోగించి చూడండి..