Share News

Congress Leader on High Court Stay: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే.. స్పందించిన కాంగ్రెస్ నేతలు

ABN , Publish Date - Oct 09 , 2025 | 05:46 PM

స్థానిక ఎన్నికలకు హైకోర్టు స్టే విధించడంపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు. బీసీలకు 42 శాతంపై అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన కూడా స్టే విధించడం విచారకరమని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ కొలిక్కి వచ్చిందనుకున్నాం.. కానీ కోర్టు తీర్పు ఊహించలేదని చెప్పారు.

Congress Leader on High Court Stay: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే.. స్పందించిన కాంగ్రెస్ నేతలు
Congress Reaction

హైదరాబాద్, అక్టోబర్ 09: రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9తో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించించడంపై కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎవరు చేయలేని సాహసం చేసిందని వ్యవసాయ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇంటింటికి తిరిగి కులగణనం చేసి 42 శాతం బీసీ రిజర్వేషన్ల రూపొందించామని గుర్తుచేశారు. బీఆర్ఎస్ - బీజేపీ ఒక్కటై బీసీలకు న్యాయం జరగకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం 42 శాతం బీసీల రిజర్వేషన్ కు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. బీసీలకు న్యాయం జరగాలనిఅభిప్రాయపడ్డారు. BRS, బీజేపీ పార్టీలు ఒక్కటై బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నాయని ఆరోపించారు.


స్థానిక ఎన్నికలకు హైకోర్టు స్టే విధించడంపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు. బీసీలకు 42 శాతంపై అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన కూడా స్టే విధించడం విచారకరమని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ కొలిక్కి వచ్చిందనుకున్నాం.. కానీ కోర్టు తీర్పు ఊహించలేదని చెప్పారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా కులగణన పూర్తి చేసి బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వివరించారు. బీసీల నోటి కాడ కూడు లాగేయడం శోచనీయమని పేర్కొన్నారు. నోటి కాడ ముద్ద ఎవరు లాగేసారో కోర్ట్ తీర్పు కాపీ వచ్చాక చెబుతామని హెచ్చరించారు. 42 శాతం బీసీల రిజర్వేషన్ కు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. బీసీ బిడ్డలు అధైర్య పడాల్సిన అవసరం లేదని. .కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ బిల్లును రెండు సభల్లో పాస్ చేసి గవర్నర్ కు పంపించామని.. గవర్నర్ బిల్లు పాస్ చేయకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


బీసీ రిజర్వేషన్ల అంశంపై ఏబీఎన్ తో మాజీ ఎంపీ వీ. హనుమంత రావు మాట్లాడారు. కోర్టు తీర్పు చాలా బాధ కలిగించిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తమ నోటి దగ్గరి ముద్దను లాక్కున్నారని మండిపడ్డారు. తారిఖ్ పే తారిఖ్ అని కోర్టు మరో తారిఖ్ ఇచ్చిందని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై ప్రభుత్వం తరపున చేయాల్సింది చేశామని చెప్పారు. అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చే సమయంలో తాము అడ్డుకోలేదని.. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే అడ్డుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థలో బీసీలు వచ్చే వరకు తమకు అన్యాయం జరుగుతూనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.


బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం దురదృష్టకరమని కాంగ్రెస్ నేత, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'హైకోర్టు తీర్పుతో చాలా నిరాశ చెందాం. బీసీ రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. కేంద్రం సహకరించకపోయినా, గవర్నర్ పట్టించుకోకపోయినా, ప్రతిపక్షాలు కలిసి రాకపోయినా సీఎం రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేశారు. కులగణనతో పాటు డెడికేటెడ్ కమిషన్ వేసి బీసీల లెక్క తేల్చాము. బీసీల నోటికాడి బువ్వ అందకుండా పోయింది.. అయినా మేం నిరాశ చెందం.. పోరాటం కొనసాగుతుంది. తప్పకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించి పెడుతాం. బీసీలు ఎవరూ అధైర్యపడొద్దు.. సీఎం రేవంత్ నాయకత్వంలో తప్పనిసరిగా రిజర్వేషన్లు సాధించుకుందాం' అని అన్నారు.


హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సెక్రటేరియట్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బయల్దేరారు. మరికాసేపట్లో సీఎంతో ఆయన సమావేశం కానున్నారు. స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. కాసేపట్లో న్యాయనిపుణులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ స్టేపై సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అటు హైకోర్ట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలు రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు. 'వుయ్ వాంట్ జస్టిస్', 'బీసీ వ్యతిరేకుల్లారా ఖబడ్దార్' అంటూ నినాదాలు చేశారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశంపై హై కోర్టు స్టే విధించిన నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్దులు అయోమయంలో ఉన్నారు. పీసీసీ ఆదేశాలతో పలువురు స్థానిక నేతలు నామినేషన్ దాఖలు చేశారు. హైకోర్టు స్టే ఇవ్వడంతో ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న ఆందోళనలో ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భారత్‌ దాల్‌.. అంతా గోల్‌మాల్‌!

Updated Date - Oct 09 , 2025 | 05:46 PM