GHMC: జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్ అభ్యంతరాల గడువు పొడిగించిన హైకోర్టు
ABN , Publish Date - Dec 17 , 2025 | 07:35 PM
హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో వార్డుల సంఖ్య పెంచి సరిహద్దులు మార్చుతున్నారు. దీనిపై అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. నేటితో (డిసెంబర్ 17)తో ముగిసే అభ్యంతరాల సమర్పణ గడువును మరో రెండు రోజులు పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది.
హైదరాబాద్, డిసెంబర్ 17: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 17తో ముగిసే అభ్యంతరాల సమర్పణ గడువును మరో రెండు రోజులు (డిసెంబర్ 19 వరకు) పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది.
పిటిషనర్ల న్యాయవాదులు మూడు రోజులు పొడిగించాలని కోరగా, డెడ్‌లైన్ దగ్గరపడటంతో రెండు రోజులు సరిపోతాయని హైకోర్టు పేర్కొంది. అదనంగా, వార్డుల వారీగా జనాభా సంఖ్యతో పాటు మ్యాప్‌లను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని జీహెచ్‌ఎంసీకి ఆదేశించింది.
ఇది ప్రజలు అభ్యంతరాలు సమర్పించడానికి సహాయపడుతుందని కోర్టు అభిప్రాయపడింది. సెన్సస్ కమిషనర్ ఇచ్చిన డిసెంబర్ 31 డెడ్‌లైన్ గురించి అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. జీహెచ్‌ఎంసీ పరిధిని విస్తరించి 150 నుంచి 300 వార్డులకు పెంచుతూ డిసెంబర్ 9న ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయింది.
దీనిపై వెల్లువలా అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం, సరిహద్దులు అశాస్త్రీయంగా ఉండటం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆదేశాలతో డీలిమిటేషన్ ప్రక్రియ మరింత పారదర్శకంగా సాగే అవకాశం ఉంది. ప్రజలు తమ అభ్యంతరాలు సమర్పించుకోవడానికి అదనపు సమయం లభించింది.
డీలిమిటేషన్ అంటే ఏమిటి?
డీలిమిటేషన్ (Delimitation) అంటే ఎన్నికల ప్రాంతాల సరిహద్దులను మళ్లీ నిర్ణయించడం లేదా పునర్విభజన చేయడం. ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ స్థానాలు, మున్సిపల్ వార్డులు వంటి ఎన్నికల యూనిట్ల సరిహద్దులను జనాభా మార్పుల ఆధారంగా సర్దుబాటు చేయడం.
ఎందుకు చేస్తారు?
జనాభా పెరిగితే లేదా తగ్గితే, ప్రతి ఎన్నికల ప్రాంతంలో ఓటర్ల సంఖ్య సమానంగా ఉండేలా చూడటం. ఉదాహరణకు ఒక వార్డులో జనాభా చాలా పెరిగితే, దాన్ని రెండు వార్డులుగా విభజించి సరిహద్దులు మార్చడం.
Also Read:
శీతాకాలంలో పచ్చి బఠానీలు తినొచ్చా?
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 36ల మధ్యలో 63 ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..