Share News

BC Reservation Bill: ఢిల్లీకి చేరిన బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లు

ABN , Publish Date - Jul 24 , 2025 | 05:52 PM

తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లు కేంద్రం హోమ్ మంత్రిత్వ శాఖకు చేరింది. న్యాయ సలహా కోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్రానికి పంపారు.

BC Reservation Bill: ఢిల్లీకి చేరిన బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లు
Telangana Governor Jishnu Dev Verma

హైదరాబాద్, జులై 24: తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన 42 శాతం బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లు ఆర్డినెన్స్ గురువారం కేంద్ర హోంమంత్రిత్వశాఖకు చేరింది. న్యాయ సలహా కోసం హోమ్ శాఖకు ఆర్డినెన్స్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పంపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌పై ఇప్పటికే అడ్వకేట్ జనరల్‌తోపాటు పలువురు సీనియర్ న్యాయవాదులతో గవర్నర్ చర్చించారు. అనంతరం ఈ బిల్లును కేంద్రానికి ఆయన పంపారు. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన ఈ బిల్లు.. గత మూడు వారాలుగా గవర్నర్ వద్ద ఉన్న సంగతి తెలిసిందే.


ఆ క్రమంలో బిల్లుపై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. వాటిని అడ్వకేట్ జనరల్‌తోపాటు సీనియర్ న్యాయవాదులు నివృత్తి చేశారు. అనంతరం కేంద్రానికి పంపారు. అయితే గతంలో సుప్రీంకోర్టు సైతం 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదంటూ ఇచ్చిన తీర్పును ఈ ఆర్డినెన్స్ ఉల్లంఘించినట్లు అవుతుందా? లేదా? అంటూ గవర్నర్ అనుమానం వ్యక్తం చేశారు. అందులో భాగంగా న్యాయ సలహా కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఈ ఆర్డినెన్స్ పంపారు. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచే అంశంలో.. రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం కొన్ని అధికారాలను కేటాయించింది. దీంతో రిజర్వేషన్లు పెంచుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.


మరోవైపు సెప్టెంబర్ 30వ తేదీ లోపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా బిల్లు ఆమోదం పొందితే.. వీటిని ఎన్నికల్లో అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

విజయవాడ, విశాఖలో మెట్రో రైలు నిర్మాణం.. టెండర్లు ఆహ్వానానికి ముహూర్తం ఖరారు

తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 24 , 2025 | 07:37 PM