Share News

Private Colleges: చర్చలు సఫలం.. తెరుచుకోనున్న కాలేజీలు

ABN , Publish Date - Nov 07 , 2025 | 08:09 PM

ప్రైవేట్ కళాశాలలు అడిగిన రూ. 1,500 కోట్లలో రూ. 600 కోట్లు ఇప్పటికే విడుదల చేశామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మరో రూ. 600 కోట్లు వెంటనే విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు.

Private Colleges: చర్చలు సఫలం.. తెరుచుకోనున్న కాలేజీలు

హైదరాబాద్, నవంబర్ 07: ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌పై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. శుక్రవారం నాడు హైదరాబాద్‌లో ఈ అంశంపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చలు జరిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రైవేట్ కాళాశాలల యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. దీంతో శనివారం నుంచి ప్రైవేట్ కళాశాలు తెరుచుకోనున్నాయి.


డిప్యూటీ సీఎం మల్లు..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కళాశాలలు అడిగిన రూ.1,500 కోట్లలో రూ.600 కోట్లు ఇప్పటికే విడుదల చేశామని గుర్తు చేశారు. మరో రూ.600కోట్లు వెంటనే విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. మిగిలిన రూ. 300 కోట్లు త్వరలో క్లియర్ చేస్తామని చెప్పారు. అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కమిటీలో ఉన్నతాధికారులు, కళాశాల యాజమాన్య ప్రతినిధులు సభ్యులుగా ఉంటారన్నారు.


పాతి అధ్యక్షుడు రమేష్ రియాక్షన్

ప్రభుత్వంతో తమ చర్చలు సఫలం కావడంతో అన్ని నిరసన కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు పాతి సంఘం అధ్యక్షుడు నిమ్మటూరి రమేష్ ఈ సందర్భంగా ప్రకటించారు. అయితే ఉన్నతాధికారులపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. అయితే తమ సమ్మె కారణంగా పరీక్షలు నిలిచిపోయినందుకు చింతిస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయాలతో చర్చించి పరీక్షలు త్వరగా నిర్వహిస్తామని నిమ్మటూరి రమేష్ ఈ సందర్భంగా హమీ ఇచ్చారు. ఇక ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో శనివారం నుంచి తలపెట్టిన లెక్చరర్ల ప్రదర్శన రద్దు చేసినట్లు పాతి జనరల్ సెక్రటరీ రవికుమార్ ప్రకటించారు.


కమిటీ స్వరూపం ఇది..

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలులో ఇబ్బందులు తలెత్తుకుండా ఉండేందుకు.. ఉన్నత విద్యను మరింతగా మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి సంబంధించి విధివిధానాలు, ట్రస్టు బ్యాంకు ద్వారా నిర్వహణ, నిధుల సేకరణకు అవసరమైన సిఫార్సులను చేయనుంది. సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి వైస్‌ చైర్మన్‌గా వ్యవహరించనున్న ఈ కమిటీలో విద్యాశాఖ, ఎస్సీ అభివృద్ధి, బీసీ సంక్షేమం, గిరిజన సంక్షేమం, మైనారిటీ సంక్షేమ శాఖల కార్యదర్శులు, ఉన్నత విద్యామండలి చైర్మన్‌తోపాటు ఫ్రొఫెసర్‌ కంచ ఐలయ్య, ప్రొఫెసర్‌ కోదండరాం, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘాల సమాఖ్య (పాతి) నుంచి ముగ్గురు ప్రతినిధులు సభ్యులుగా ఉండనున్నారు. వీరితోపాటు కమిటీ చైర్మన్‌ నిర్ణయించే మరో వ్యక్తి కూడా సభ్యుడిగా ఉంటారు. మొత్తం 15మందితో కూడిన ఈ కమిటీకి ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయిన వేలాది మంది ప్రయాణికులు..

పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరగాలంటే..

For More TG News And Telugu News

Updated Date - Nov 07 , 2025 | 09:49 PM