Fees Reimbursement: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం
ABN , Publish Date - Nov 04 , 2025 | 05:49 PM
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి సంస్కరణల కోసం కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం మంగళవారం జారీ చేసింది.
హైదరాబాద్, నవంబర్ 04: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకొంటుంది. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యాలు ఆందోళనకు దిగుతామంటూ పలు దఫాలుగా ప్రకటనలు చేస్తున్నాయి. అలాంటి వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి సంస్కరణలపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.
స్పెషల్ చీఫ్ సెక్రటరీతో పాటు 15 మందితో ఈ కమిటీని నియమించింది. ఇక కాలేజీల నుంచి ఈ కమిటీలో ముగ్గురికి చోటు కల్పిస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే ఈ కమిటీలో ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరాంలకు చోటు కల్పించినట్లు స్పష్టం చేసింది. ఈ కమిటీ.. పీజు రీయింబర్స్‌మెంట్ పాలసీపై ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనుంది.
అలాగే ప్రత్యేక ట్రస్ట్ ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ సాధ్యాసాధ్యాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. అయితే మూడు నెలల్లో ఈ కమిటీ నివేదిక అందజేయాలని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో క్లియర్ కట్‌గా సూచించింది. అలాగే విద్యా సంస్థలు స్పష్టం చేసిన సూచనలపై సైతం అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం, ప్రభుత్వానికి మధ్య దూరం బాగా పెరుగుతోంది. సమయానికి ప్రభుత్వం ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో.. కాలేజీ యాజమాన్యం తమ కళాశాలల బంద్‌కు పిలుపునిస్తుంది. ఆ క్రమంలో కాలేజీ యాజమాన్యంతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. దీంతో వాయిదాల రూపంలో నగదు చెల్లిస్తామంటూ కాలేజీల యాజమాన్యానికి ప్రభుత్వం తెలుపుతోంది. అందుకు ఆ కాలేజీల యాజమాన్యం సానుకూలంగా స్పందిస్తోంది.
అలా పలు దఫాలుగా నగదు చెల్లిస్తున్నాయి. అయితే కొన్ని సమయాల్లో నగదు చెల్లింపులు తీవ్ర ఆలస్యమవుతోంది. దీంతో ప్రభుత్వ వ్యవహారశైలిపై యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో కాలేజీల యాజమాన్యం రంగంలోకి దిగి బంద్ అంటూ ప్రకటనలు చేస్తున్నాయి. ఈ తరహా ఘటనలు పునరావృతం కావడంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వానికి కీలక సూచనలు చేయాలంటూ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..
సీఎంకు పట్టుకున్న ఓటమి భయం: నిరంజన్ రెడ్డి
కార్తీక పౌర్ణమి.. 365 వత్తులతో దీపారాధన.. ఎందుకు వెలిగిస్తారంటే?
Read Latest Telangana News And Telugu News