T Cabinet Expansion: మాకు అవకాశం ఇవ్వండి.. మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేల వినతి
ABN , Publish Date - Jun 05 , 2025 | 03:11 PM
T Cabinet Expansion: మంత్రివర్గంలో తప్పనిసరిగా తమకు స్థానం కల్పించాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను కోరామని మాదిగ సామాజికవర్గం ఎమ్మెల్యేలు తెలిపారు. తమ సామాజిక వర్గం నేతలకు మంత్రివర్గంలో స్థానం పట్ల అధిష్టాన పెద్దలు సానుకూలంగా స్పందించారని తెలిపారు.
న్యూఢిల్లీ, జూన్ 5: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ త్వరలో జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో ఆశావాహులు అప్రమత్తమయ్యారు. తమకు మంత్రి పదవులు ఇవ్వాలంటూ కాంగ్రెస్ హైకమాండ్‌కు వినతులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు (గురువారం) మాదిగ సామాజికవర్గానికి చెందిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. వీరిలో అడ్లూరి లక్ష్మణ్, మందుల సామేల్, కాలే యాదయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ ఉన్నారు. గత నెల రోజులుగా కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలు, పీసీసీ, సీఎం, రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ను కలిసి మంత్రివర్గంలో తమ సామాజికవర్గం ఎమ్మెల్యేలకు స్థానం కల్పించాలని విజ్ఞాపనలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నలుగురు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. మంత్రివర్గంలో తప్పనిసరిగా తమకు స్థానం కల్పించాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను కోరామన్నారు. తమ సామాజిక వర్గం నేతలకు మంత్రివర్గంలో స్థానం పట్ల అధిష్ఠాన పెద్దలు సానుకూలంగా స్పందించారని తెలిపారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగిన తమ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం ఉంటుందని భావిస్తున్నామని అన్నారు. ఇది మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఆరుగురు ఎమ్మెల్యేల అంశం కాదని.. యావత్ మాదిగ ప్రజలకు సంబంధించిన అంశమని తెలిపారు. 200 శాతం న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.
తమ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సైతం లేఖ రాశామన్నారు. అపాయింట్‌మెంట్ దొరికితే రాహుల్ గాంధీని కలిసి డిమాండ్లు తెలియజేస్తామన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని.. మాదిగ సామాజికవర్గీయులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ రాజకీయంగా కీలక పదవుల్లో ప్రాతినిధ్యం లేదన్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న ఆరుగురు మాదిగ సామాజికవర్గం ఎమ్మెల్యేలలో అధిష్ఠానం ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. మంత్రివర్గంలో ఉన్న కొందరు తమ సామాజికవర్గం పేరు చెప్పుకుంటున్నారని.. తెలంగాణ మంత్రివర్గంలో ఇప్పటివరకూ ఎటువంటి మాదిగలు లేరన్నారు. నిజమైన మాదిగలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతున్నామని నలుగురు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ఇంటర్‌క్యాస్ట్ ప్రేమ.. పోలీసుల కళ్లెదుటే ఆ జంటపై
తప్పుడు ఇంజెక్షన్‌తో ఆరుగురి మృతి!
Read Latest AP News And Telugu News