Share News

Hyderabad: ట్రాఫిక్ సమస్యలకు వీరే కారణం.. కేసులు నమోదు చేస్తున్నా తీరు మారడం లేదు..

ABN , Publish Date - Feb 08 , 2025 | 03:43 PM

హైదరాబాద్: బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో వారంలో పలుమార్లు ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాహనాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పోలీసులు గుర్తించారు. యజమానులను ప్రశ్నించగా కేసులు పెట్టుకోండి మేము మారం అన్నట్టు సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.

 Hyderabad: ట్రాఫిక్ సమస్యలకు వీరే కారణం.. కేసులు నమోదు చేస్తున్నా తీరు మారడం లేదు..
Hyderabad Traffic Issues

బంజారాహిల్స్‌, ఫిబ్రవరి 7: హైదరాబాద్ నగరం రోడ్లపై ట్రాఫిక్‌ పెరిగిపోతోంది. ఏ చౌరస్తా చూసినా వాహనాలతో కిక్కిరిసిపోతోంది. అయితే కొంతమంది వాహన చోదకులు చేస్తున్న తప్పుల వల్ల తోటి వాహనదారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇలాంటి వారిపై పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా వారిలో మాత్రం మార్పు కనిపించడం లేదు.


విశాలమైన రోడ్లు ఉన్నా...

ముఖ్యంగా పశ్చిమ మండలం పరిధిలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, సంజీవరెడ్డినగర్‌ తదితర ప్రాంతాల్లో విశాలమైన రోడ్లు ఉన్నప్పటికీ ఆఫీసు సమయాల్లో ట్రాఫిక్‌ జామ్‌ తప్పడం లేదు. రోడ్లపై వాహనాల రద్దీ కారణంగా కొన్నిచోట్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతుండగా, మరికొన్ని సమస్యలు వాహన చోదకులు ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల వస్తున్నాయని నమోదవుతున్న కేసుల సంఖ్యను బట్టి తెలుస్తోంది.


ట్రాఫిక్‌ లేని సమయంలో కూడా...

సంక్రాంతి సమయంలో నగరంలో ట్రాఫిక్‌ చాలా తక్కువగా ఉంటుంది. అయితే, ఆ సమయంలో కూడా వాహన చోదకుల అతివేగం తోటి ప్రయాణికుల ప్రాణాల మీదకు తెస్తోంది. గత నెల ఓ వ్యక్తి పండగ స్వీట్లు కొనుగోలు చేసేందుకు సంజీవరెడ్డినగర్‌కు వెళ్లగా వెనుకాల నుంచి త్రిబుల్‌ రైడింగ్‌లో అతి వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఇలాంటి ఘటనలు ట్రాఫిక్‌ పోలీసులను సైతం కలవరపెడుతున్నాయి.


పదే పదే ఉల్లంఘనలు...

బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో వారంలో పలుమార్లు ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాహనాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పోలీసులు గుర్తించారు. యజమానులను ప్రశ్నించగా కేసులు పెట్టుకోండి మేము మారం అన్నట్టు సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా కేబీఆర్‌ పార్కు చౌరస్తాలో అతి వేగంగా వెళ్తూ పట్టుబడ్డ వారే పదే పదే పోలీసులకు చిక్కిన వైనాలున్నాయి. ఇలాంటి వారిలో మార్పు తీసుకురాకపోతే తోటి ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారే ప్రమాదం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. పదే పదే ట్రాఫిక్‌ ఉల్లంఘనకు పాల్పడే వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి మార్పు తేచ్చే బాధ్యతను కూడా పోలీసులే తీసుకుంటున్నారు. ద్విచక్ర వాహనదారులు, కార్ల యజమానులు, ఆటో డ్రైవర్లకు వేర్వేరుగా పలుమార్లు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కలిగించారు.


2024లో 9,07,873 కేసులు నమోదు..

పశ్చిమ మండలం పరిధిలో గతేడాది ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. 2023లో 817.210 కేసులు నమోదు కాగా, 2024లో 9,07,873 నమోదయ్యాయి. డ్రంకెన్‌డ్రైవ్‌ కేసుల సంఖ్య 2023లో 7621 కాగా, గతేడాది 9608 నమోదయ్యాయి. పట్టుబడిన వాహనాల్లో 75 శాతానికి పైగా ద్విచక్ర వాహనాలున్నాయి. మైనర్‌ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించి 339 కేసులు నమోదు చేశారు. డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనాలు నడిపి చిక్కినవారు 9,693 మంది ఉన్నారు. ఈ యేడాది కేవలం జనవరిలోనే సుమారు 80 వేల కేసులు నమోదయ్యాయని గుణాంకాలు చెబుతున్నాయి. గతంతో పోలిస్తే 20 శాతం ట్రాఫిక్‌ ఉల్లంఘనలు పెరిగాయి.


గతేడాది నమోదైన కేసుల వివరాలు..

  • అనధికార వ్యక్తులు వాహనాలు నడపడం- 8768

  • ప్రీలెఫ్ట్‌లో వాహనాలు నిలిపినందుకు- 6169

  • సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ- 10,295

  • ప్రమాదకరంగా డ్రైవింగ్‌- 1242

  • మద్యం తాగి- 9608

  • అతి ప్రమాదకర ప్రయాణం- 4618

  • ఫ్యాన్సీ నంబర్‌ మార్చి రాయడం- 15038

  • మైనర్లు వాహనం నడపడం- 389

  • నంబర్‌ ప్లేటు సరిగా లేకపోవడం- 12533

  • హెల్మెట్‌కు సంబంధించి- 1,081

  • సర్వీస్‌ రోడ్లపై పార్కింగ్‌- 1,09,375

  • సిగ్నల్‌ జంపింగ్‌- 14470

  • జీబ్రా లైన్‌ క్రాసింగ్‌- 60,622

  • అపసవ్య దిశలో డ్రైవింగ్‌- 53,834

  • డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోవడం- 9,693

  • నంబర్‌ ప్లేటు లేని వాహనదారులు- 641

  • సీటు బెల్టు ధరించకపోవడం- 1577

  • ట్యాక్సీ డ్రైవర్‌ వేధింపులు/అసభ్య ప్రవర్తన- 37


రద్దీ సమయాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం..

పశ్చిమ మండలంలో ప్రధానమైన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ విపరీతంగా ఉంటోంది. అందువల్ల ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ విశ్వప్రసాద్‌, డీసీపీ రాహుల్‌ హెగ్దే సూచనల మేరకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. దాదాపు 30 మంది హైడ్రో సిబ్బంది, 8 మంది ట్రాన్సె జెండర్ల సేవలను వినియోగించుకుంటున్నాం. ట్రాఫిక్‌ సమస్యలకు కారణమవుతున్న విద్యుత్తు స్తంభాల తొలగింపు, రహదారులకు మరమ్మతులు వంటి అంశాలపై దృష్టి సారించాం. - కట్టా హరిప్రసాద్‌ పశ్చిమ మండలం ట్రాఫిక్‌ ఏసీపీ

Updated Date - Feb 08 , 2025 | 03:44 PM