Sigachi Company: మృతుల కుటుంబాలకు కోటి పరిహారం.. సిగాచి యాజమాన్యం ప్రకటన
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:49 PM
Sigachi Company: సిగాచి పరిశ్రమలో ప్రమాదంపై యాజమాన్యం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందిస్తామని ప్రకటించింది.
హైదరాబాద్, జులై 2: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి కంపెనీలో (Sigachi company) జరిగిన ఘోర ప్రమాదంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగిన మూడు రోజుల తర్వాత ఎట్టకేలకు కంపెనీ స్పందిస్తూ కీలక ప్రకటన చేసింది. సిగాచి ప్రమాదంపై స్టాక్ మార్కెట్లకు కంపెనీ సెక్రటరీ వివేక్ లేఖ రాశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. పరిహారంతో పాటు అన్నిరకాల బీమా క్లెయిమ్స్‌ను చెల్లిస్తామని ప్రకటించారు. గాయపడిన వారికి పూర్తి వైద్య సాయం అందిస్తామని, కుటుంబపోషణను తామే చూసుకుంటామని సిగాచి సెక్రటరీ తెలిపారు.
ప్రమాదంలో 40 మంది మృతి చెందారని, మరో 33 మందికి గాయాలు అయినట్లు చెప్పారు. ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ప్రమాదం నేపథ్యంలో మూడు నెలల వరకు ప్లాంట్ పనులు నిలిపివేస్తామని సిగాచి యాజమాన్యం ప్రకటించింది.

కాగా.. నిన్న (మంగళవారం) పాశమైలారంలో ప్రమాద స్థలిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సిగాచి కంపెనీపై కఠిన చర్యలు తీసుకుంటామని, మానవీయకోణంలో చనిపోయిన వారి కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆ కోటి రూపాయలను కంపెనీ ద్వారా బాధితులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే 48 గంటలు గడిచినప్పటికీ కంపెనీ ఎండీ ఘటనా స్థలికి రాకపోవడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో ఈరోజు సిగాచి కంపెనీ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. చనిపోయిన కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వడంతో పాటు క్షతగాత్రులకు వైద్య ఖర్చులను తామే భరిస్తామని సిగాచి యాజమాన్యం పేర్కొంది.
ఇవి కూడా చదవండి
మంత్రి దామోదరతో బాధితుల వాగ్వాదం.. సర్దిచెప్పిన మినిస్టర్
Read Latest Telangana News And Telugu News