Telangana: మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ.. ఎదురుకాల్పుల్లో 21 మంది హతం..
ABN , Publish Date - Jan 22 , 2025 | 07:34 AM
హైదరాబాద్: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రియాబంద్- ఒడిసాల్లోని నౌపాడ జిల్లాల పరిధి కుల్హారిఘాట్ అడవుల్లో రెండ్రోజులుగా భారీ ఎన్‌కౌంటర్ జరుగుతోంది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకూ 21 మంది మావోలు మృతిచెందారు.
హైదరాబాద్: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రియాబంద్- ఒడిసాల్లోని నౌపాడ జిల్లాల పరిధి కుల్హారిఘాట్ అడవుల్లో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. రెండ్రోజులుగా జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకూ 21 మంది మావోలు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ అప్పారావు అలియాస్ జయరామ్ రెడ్డి సైతం ఉన్నారు.
ఈ సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుండగా మావోయిస్ట్ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీఎల్జీఏ సుప్రీం కమాండర్ మడవి హిడ్మా టార్గెట్‌గా సౌత్ బస్తర్‌లో భారీ సెర్చ్ ఆపరేషన్ సాగుతోంది. జనవరి 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మడవి హిడ్మాతోపాటు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ (దాదా) అలియాస్ బడే చొక్కారావు తప్పించుకున్నారు. దీంతో మావోయిస్ట్ కంచుకోట అభూజ్ మడ్‌ను భద్రతా దళాలు అష్టదిగ్బంధం చేశాయి. అయితే సేఫ్ జోన్ కోసం మావోయిస్టులు తెలంగాణలో అడుగుపెడతారని నిఘావర్గాల నుంచి సమాచారం అందుతోంది.
ఈ నేపథ్యంలో భద్రాద్రి ఏజెన్సీలో తెలంగాణ గ్రే హౌండ్స్ బలగాలు అప్రమత్తమయ్యాయి. అలాగే కేంద్ర కమిటీ సభ్యులు తెలంగాణ, ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాలకు వెళ్తారని భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి. కాగా, తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు, ఛత్తీస్‌గఢ్-ఒడిషా సరిహద్దు, ఛత్తీస్‌గఢ్- మహారాష్ట్ర సరిహద్దుల్లో నలుదిక్కులా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. దీంతో దండ కారణ్యం వార్ జోన్‌గా మారింది. వరస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలినట్లు అవుతోంది. ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టులు కకలావికలం అవుతున్నారు.
కాగా, కుల్హారిఘాట్ అటవీ ప్రాంతంలో 60 మంది మావోయిస్టులు ఉన్నట్లు నిఘావర్గాలకు సమాచారం అందింది. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్ పోలీసులను అప్రమత్తం చేశారు. జనవరి 19న రాత్రి గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా, ఒడిశా రాష్ట్రం నౌపాడ ఎస్పీ గుండాల రాఘవేంద్ర, ఒడిశా నక్సల్స్ ఆపరేషన్ డీఐజీ అఖిలేశ్వర్‌సింగ్, కోబ్రా కమాండెంట్ డీఎస్ కథాటే నేతృత్వంలో ఇరు రాష్ట్రాలకు చెందిన సుమారు 1,000 మంది జవాన్లు రంగంలోకి దిగారు. ఒడిశా యాంటీ నక్సల్స్ విభాగం స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(ఎస్‌వోజీ)కి చెందిన 3 యూనిట్లు నాలుగు డ్రోన్ కెమెరాలతో అర్దచంద్రాకారంలో నక్సల్స్ ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మిగతా భాగాన్ని ఛత్తీస్‌గఢ్ డీఆర్‌జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు చక్రవ్యూహం మాదిరిగా దిగ్బంధించాయి. ఎవరూ తప్పించుకునే వీలులేకుండా బలగాలు ముందుకు సాగగా.. వారికి మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.