Attack on Rangarajan Case: రామరాజ్యం వీరరాఘవరెడ్డి గురించి పోలీసులు ఏం చెప్పారంటే..
ABN , Publish Date - Feb 15 , 2025 | 08:10 PM
హైదరాబాద్: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.

హైదరాబాద్: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రంగరాజన్‌పై దాడి చేసిన రామరాజ్యం వీర రాఘవరెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. తనను తానే శివుడి అవతారంగా వీర రాఘవరెడ్డి ప్రచారం చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. శివుడి అవతారం ధరించానంటూ కోసలేంద్ర ట్రస్టు స్థాపించి రామరాజ్యం పేరుతో యువతీయువకులను అందులో చేర్చుకుంటున్నాడని వెల్లడించారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ రామరాజ్యంతోనే సాధ్యమని నిందితుడు వీడియోలు సైతం రూపొందించి యువతను ఆకర్షించే ప్రయత్నం చేశాడని తెలిపారు.
ఈ మేరకు వీర రాఘవరెడ్డిని అరెస్టు చేయటానికి గల కారణాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వీరరాఘవరెడ్డి, అతని అనుచరులు రామరాజ్యం పేరుతో దోపిడీ చేస్తున్నారని ఖాకీలు సంచలన విషయాలు వెల్లడించారు. దేవాలయాల పూజారులపై భౌతికదాడులు చేస్తూ తమకు మద్దుతు ఇవ్వాలని రెచ్చిపోతున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్‌పై దాడి చేసినట్లు తెలిపారు. వారికి మద్దతు ఇచ్చేందుకు ఉగాది వరకూ సమయం ఇస్తూ రంగరాజన్‌పై బెదిరింపులకు దిగినట్లు పేర్కొన్నారు. వీర రాఘవరెడ్డికి గతంలోనూ నేర చరిత్ర ఉందని, అతనిపై 2015, 2016లోనే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. అతడిని అరెస్టు చేయకుండా ఉంటే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు.
కాగా, రంగారెడ్డి జిల్లా మెయినాబాద్‌లో నివాసం ఉంటున్న పూజారి రంగరాజన్ ఇంటికి ఫిబ్రవరి 6న రామరాజ్యం పేరుతో దాదాపు 20 మంది వెళ్లారు. తమకు మద్దతు తెలపాలంటూ ఆయనపై బెదిరింపులకు దిగారు. తాను రాజ్యాంగం ప్రకారం మాత్రమే పని చేస్తానని చెప్పడంతో రంగరాజన్, అతని కుమారుడిపై దాడి చేశారు. ఈ ఘటన ఫిబ్రవరి 6న జరగగా.. ఆలయ మేనేజింగ్ కమిటీ ఛైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ ఫిర్యాదుతో ఈనెల 9న ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. అయితే దాడి ఘటనను పలు హిందూ సంఘాలు ఖండించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్‌లో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా అర్చకుడు రంగరాజన్‌ను పరామర్శించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన వీరరాఘవరెడ్డితోపాటు మరో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Music Night: యుఫోరియా మ్యూజికల్ నైట్.. ఉర్రూతలూగిస్తున్న తమన్..
Nizamabad: పసుపు మార్కెట్ యార్డు సెక్యూటిరీ అధికారిపై దాడి.. పరిస్థితి ఎలా ఉందంటే..