అనాథగా నిజాం ప్యాలెస్.. పట్టించుకునే దిక్కే లేదా..?
ABN , Publish Date - Nov 30 , 2025 | 08:41 AM
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగానే గాక, దక్కన్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన ప్రభువుగా పేరు పొందిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అమితమైన కళారాధకుడు, సాహిత్యప్రియుడు కూడా. హైదరాబాద్‌లో వేసవి ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నాయన్న కారణంగా చల్లని ప్రదేశంలో విడిది కేంద్రాన్ని నిర్మించాలని తలచాడు.
ఊటీలో ఆసఫ్ జాహీల వేసవి విడిది
దక్షిణాదిలోనే అందమైన ప్యాలెస్ గా పేరు
నీలగిరి పర్వతప్రాంతంలో అద్భుత కట్టడం
కుటుంబ తగాదాలతో నిరుపయోగంగా మారిన రాజ భవనం
హైదరాబాద్ సిటీ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): నీలగిరి పర్వత ప్రాంతంలో చుట్టూ పచ్చిక బయళ్లు, తేయాకు తోటలు, దేవదారు వృక్షాల నడుమ యూరోపియన్ శైలిలో రాజ దర్పాన్ని ప్రదర్శిస్తూ అందమైన భవనంగా వెలుగొందిన నిజాం ప్యాలెస్ నేడు శిథిలావస్థకు చేరింది. ఒకనాడు దక్షిణాదిలోనే అందమైన విడిది కేంద్రంగా విరాజిల్లిన ఆ రాజభవనం నేడు నిర్లక్ష్యానికి లోనై వయసు మీరిన వ్యక్తిగా రంగు వెలసి కునా రిల్లుతోంది. తమిళనాడు రాష్ట్రం, ఊటీలో అనాథగా మిగిలిన ఆ రాజభవనం మన హైదరాబాద్ వైభవోపేతమైన చరిత్రకు చిహ్నం. ఈ రాజ భవనంపై ఆదివారం ప్రత్యేక కథనం.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగానే గాక, దక్కన్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన ప్రభువుగా పేరు పొందిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అమితమైన కళారాధకుడు, సాహిత్యప్రియుడు కూడా. హైదరాబాద్‌లో వేసవి ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నాయన్న కారణంగా చల్లని ప్రదేశంలో విడిది కేంద్రాన్ని నిర్మించాలని తలచాడు. అదే సమయంలో మద్రాసు బ్రిటీషు ఉన్నతాధికారి రోడెస్ ఊటీలో 1860లో కట్టించిన సుందర భవనం (సిడార్స్ బంగ్లా) అమ్మకానికి ఉందని తెలిసిన అలీ ఖాన్ వెంటనే ఆ భవనాన్ని కొనుగోలు చేశాడు. పెద్ద లాస్లు, రాయల్ ఫర్నిచర్, కలపతో చేసిన గృహోపకరణాలు, రాజసం ఉట్టిపడేలాంటి పెద్ద ఆర్చీలు, పొడవైన కిటికీలు, అండమైన గార్డెన్తో రాజకోటకు ఏ మాత్రం తీసిపోని విధంగా అడుగడుగునా కళాత్మకత ఉట్టిపడేలా రూపుదిద్దుకుందా భవనం.
చిన్నారికి నిజాం ఆశీర్వాదం
నిజాం సొంతం చేసుకున్న సదరు సిడార్ఫ్ బంగ్లా పేరుకాస్త ప్యాలెస్ గా, మరికొందరి నోట మహరాజ ప్యాలెస్‌గా పలికింది. ఆ కోఠిలోని బ్రిటీషు రెసిడెంట్ సర్ విలియం బర్దాన్ వేసవిలో తన భార్యా, పిల్లలతో కలసి విహారానికి వెళ్లినప్పుడల్లా నిజాం ప్యాలెన్లోనే కొన్నినెలలపాటు గడిపేవారు. ఆ రాజభవనంలోనే బర్టాన్ దంపతులకు కుమార్తె ఎలిజబెత్ హామిల్టన్ జన్మించింది. మీర్ ఉస్మాన్ అలీఖాన్ కుటుంబ సభ్యులతో కలసి ఊటీకి వెళ్లి మరీ ఆ చిన్నారిని ఆశీర్వదించించారు. ఈ విషయాలను తర్వాత కాలంలో ఎలిజిబెత్ హామిల్టన్ ఫెరిం గీస్: సర్ రాబర్ట్ అండ్ సర్ విలియమ్స్' పుస్తకంలో ప్రస్తావించారు.
అంతర్జాతీయ పాఠశాలగా మార్చే ప్రయత్నం..
హైదరాబాద్ రాష్ట్రం భారత్ లో విలీనమైన తర్వాత నగరంలోని పలు రాజభవనాలతోపాటు ఊటీలోని నిజాం ప్యాలెస్ కూడా వారి కుటుంబ ఆస్తి పరిధిలోకి వచ్చింది. సువిశాలమైన భవనంలో అంతర్జాతీయ పాఠశాల ప్రారంభించాలన్న లక్ష్యంతో విద్యావేత్త పీసీ థామస్ నిజాం మనుమడు ముకర్రం ఝాను 2006లో సంప్రదించాడు. ఆ భవనం కొనుగోలుకు బేరసారాలు కూడా ముగిసి సొమ్ము చెల్లించడానికి థామస్ సిద్ధమయ్యాడు. అయితే, ఊటీలోని నిజాం ప్యాలెస్ ను విక్రయించే అధికారం ఎనిమిదో నిజాం ముకర్రం ఝాకు లేదని కోర్టు తీర్పువెలువరించింది. నిజాం ఫ్యామిలీ ట్రస్ట్ సభ్యులు కొందరు సైతం ఆసఫ్ జాహీల చరిత్ర, వారసత్వానికి ప్రతీకలైన రాజభవనాల మీద ఒక వ్యక్తికి అధికారం చెల్లదని న్యాయపోరాటానికి దిగారు.
వారసత్వ తగాదాలతో నిరుపయోగంగా మారిన భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరువలో ఉందని చరిత్ర అధ్యయనకారులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. గతేడాది కొంతమంది దొంగపత్రాలు సృష్టించి రూ.121కోట్ల విలువచేసే ఊటీ నిజాం ప్యాలెస్ ను స్వాధీనం చేసుకోవాలని చూశారు. నిజాం కుటుంబానికి చెందిన ఫాతిమా ఫౌజియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికక్కడే ఆక్రమణ ఆగిపోయింది. ఒకనాడు రాజభవనంగా విరాజిల్లిన అందమైన చారిత్రక కట్టడం అనాథలా మారడం చూసి స్థానికులు, పర్యాటకులు సైతం బాధను వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ పాలకులకు చెందిన ఊటీలోని ప్యాలెస్ ను పరిరక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధపెట్టాలని ఇన్ ట్యాక్ అనూరాధా రెడ్డి కోరారు. వివాదాలను పరిష్కరించి, ఆ భవనాన్ని మన చరిత్రకు చిహ్నంగా తీర్చిదిద్దాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
KTR: తెలంగాణ తొలి శత్రువు కాంగ్రెస్సే
Village Politics: గ్రామం కోసం ఖాకీని వదిలేసి..