Share News

KTR: తెలంగాణ తొలి శత్రువు కాంగ్రెస్సే

ABN , Publish Date - Nov 30 , 2025 | 07:07 AM

తెలంగాణ కథలో కాంగ్రెస్‌ పార్టీ ముమ్మాటికి విలన్‌. 1950 నుంచి 2025 వరకు తెలంగాణకు తొలి శత్రువు, శాశ్వత శత్రువు కాంగ్రెస్సే...

KTR: తెలంగాణ తొలి శత్రువు కాంగ్రెస్సే

  • కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ లేదు: కేటీఆర్‌

  • మహేశ్‌గౌడ్‌కు ఉద్యమం గురించి మాట్లాడే అర్హత లేదు: హరీశ్‌రావు

హైదరాబాద్‌/సిద్దిపేట, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ కథలో కాంగ్రెస్‌ పార్టీ ముమ్మాటికి విలన్‌. 1950 నుంచి 2025 వరకు తెలంగాణకు తొలి శత్రువు, శాశ్వత శత్రువు కాంగ్రెస్సే’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో ఒక కీలక ఘట్టమైన దీక్షా దివస్‌ సందర్భంగా శనివారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ అనే మూడు అక్షరాలు లేకుంటే తెలంగాణ లేదు అన్నది సత్యం అని స్పష్టం చేశారు. ఉద్యమకాలంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఎక్కడున్నారో ఎవరికీ తెలియదని, ఆయన ఈ రోజు కేసీఆర్‌ దీక్ష గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే కాంగ్రెస్‌లో చేర్చుకున్న 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. రెండేళ్లుగా తెలంగాణలో కేసీఆర్‌ మాట లేకుండా రాజకీయం నడవడం లేదని, అంతటి బలమైన ముద్ర కేసీఆర్‌దని ఆయన అన్నారు. కార్యక్రమంలో మహమూద్‌ అలీ, బండ ప్రకాశ్‌, వాణీదేవి తదితరులు పాల్గొన్నారు. దీక్షా దివ్‌సను న్యూజిలాండ్‌లో కూడా ఘనంగా నిర్వహించారు. దీక్షా దివస్‌ లేనిదే తెలంగాణ లేదు ‘‘నవంబరు 29న కేసీఆర్‌ చేపట్టిన దీక్షా దివస్‌ లేకుంటే డిసెంబరు 9 ప్రకటన లేదు. డిసెంబరు 9 లేకుంటే జూన్‌ 2న తెలంగాణ స్వరాష్ట్రం లేదు’’ అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. దీక్షా దివ్‌సను పురస్కరించుకొని శనివారం సిద్దిపేటలోని తన క్యాంపు ఆఫీసు ఎదుట దీక్షలకు సంబంధించిన పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు. తర్వాత రంగధాంపల్లి అమరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. తొలుత ప్రజాకవి అందెశ్రీ మృతికి సంతాపంగా మౌనం పాటించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ భవన్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ దీక్ష గురించి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ మూర్ఖంగా మాట్లాడారని, ఉద్యమం గురించి మాట్లాడే హక్కు, అర్హతలు ఆయనకు లేవన్నారు. ఉద్యమకారుడిగా తనమీద 370 కేసులు ఉన్నాయని, సీఎం రేవంత్‌, మంత్రుల మీద ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు. మూడురోజులుగా కృష్ణానీళ్ల వాటాల గురించి చర్చలు జరుగుతున్నాయని, ఏపీ సీఎం చంద్రబాబు నీళ్లను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి, ఉత్తుత్త మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు చోద్యం చూస్తున్నారని ఆయన విమర్శించారు.

Updated Date - Nov 30 , 2025 | 07:10 AM