Village Politics: గ్రామం కోసం ఖాకీని వదిలేసి..
ABN , Publish Date - Nov 30 , 2025 | 07:02 AM
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో ముఖ్యంగా సర్పంచ్‌గా తన స్వగ్రామానికి సేవ చేసేందుకు ఓ ఎస్సై(సబ్ ఇన్ స్పెక్టర్) ఏకంగా...
సర్పంచ్ పోటీ కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన కోదాడ ఎస్సై
ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఎన్నికల బరిలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు
నల్లగొండ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్ !
ముందుజాగ్రత్త.. ఒకే సర్పంచ్ స్థానానికి భార్యాభర్తల నామినేషన్లు
కోదాడ రూరల్, తిప్పర్తి, జైనూర్, నవీపేట, చిట్యాల రూరల్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో ముఖ్యంగా సర్పంచ్‌గా తన స్వగ్రామానికి సేవ చేసేందుకు ఓ ఎస్సై(సబ్ ఇన్ స్పెక్టర్) ఏకంగా తన పదవికి రాజీనామా చేసేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ ఎస్సై పులి వెంకటేశ్వర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన పులి వెంకటేశ్వర్లు 1989లో కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరారు.
ఏడాది క్రితమే ఏఎ్‌సఐ నుంచి ఎస్సైగా పదోన్నతి పొందిన ఆయన 2026 ఏప్రిల్‌లో ఉద్యోగ విరమణ పొందనున్నారు. అయితే, పంచాయతీ ఎన్నికల్లో గుదిబండ గ్రామ సర్పంచ్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఆయన మరికొన్ని నెలలు సర్వీసు ఉన్నప్పటికీ శనివారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. సర్పంచ్ పదవికి ఆదివారం నామినేషన్ వేయబోతున్నారు. పులి వెంకటేశ్వర్లు కుమార్తె కూడా ఎస్సైగా పని చేస్తున్నారు. ఇక, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి సర్పంచ్ స్థానానికి ఆ గ్రామానికి చెందిన సాధన అలియాస్ సంతోష్ (26) అనే ట్రాన్స్‌జెండర్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. అలాగే, నిజామాబాద్ జిల్లా నవీపేట గ్రామ పంచాయతీ 14వ వార్డు మెంబర్ స్థానానికి గ్రామానికి చెందిన కొండపల్లి అంకిత అనే ట్రాన్స్‌జెండర్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. 2019 పంచాయతీ ఎన్నికలల్లోనూ వార్డు మెంబర్‌గా పోటీ చేసిన అంకిత 18 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
మరోపక్క, నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం యల్లమ్మగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్ అయ్యారనే వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. యల్లమ్మగూడెం సర్పంచ్ స్థానానికి బీఆర్‌ఎ్‌సకు చెందిన మామిడి నాగలక్ష్మి నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. యల్లమ్మగూడెంకు చెందిన నాగలక్ష్మి భర్తతో కలిసి నకిరేకల్‌లో నివాసముంటున్నారు. అయితే, నామినేషన్ వేసేందుకు గ్రామానికి వెళ్లేందుకు కారు తీసుకొస్తానని శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన నాగలక్ష్మి భర్త మామిడి యాదగిరి మధ్యాహ్నమైన తిరిగి రాలేదు. భర్త ఫోన్ స్విచ్చా్‌ఫలో ఉండగా నాగలక్ష్మి ఒంటరిగా తిప్పర్తి చేరుకున్నారు.
అయితే, మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తనకు ఫోన్ చేసిన యాదగిరి.. నామినేషన్ వేయవద్దని చెప్పి కాల్ కట్ చేశారని నాగలక్ష్మి అంటున్నారు. నాగలక్ష్మి ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా గ్రామానికి చేరుకున్న ఆయన ఆమెకు ధైర్యం చెప్పి నామినేషన్ వేయించారు. ఇక, విషయం తెలిసి తిప్పర్తి ఎస్సై శంకర్.. నాగలక్ష్మి ఇంటికి వెళ్లగా ఆమె ఫిర్యాదు చేశారు. తన భర్తను కిడ్నాప్ చేసిన వారిపై కేసు పెట్టాలని ఎస్పీని కోరుతామని నాగలక్ష్మి తెలిపారు. మరోపక్క, నల్లగొండ జిల్లా చిట్యాల మండలం తాళ్లవెల్లంల సర్పంచ్ స్థానానికి గ్రామానికి చెందిన నల్లబెల్లి రమేష్, అతడి భార్య వినోద వేర్వేరుగా నామినేషన్లు చేశారు. బీఆర్‌ఎస్ మద్దతుదారులైన ఈ దంపతులు తమలో ఒకరి నామినేషన్ తిరస్కరణకు గురైతే మరొకరు పోటీలో ఉంటారనే ముందుజాగ్రత్తతో ఇలా నామినేషన్లు వేశారు.
ఈ వార్లలు కూడా చదవండి:
Kishan Reddy: ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు లేదు
Deputy CM Batti: గ్రిడ్ రక్షణకు థర్మల్ విద్యుత్