Share News

Kishan Reddy: ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు లేదు

ABN , Publish Date - Nov 30 , 2025 | 07:13 AM

పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి విమర్శించారు.

Kishan Reddy: ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు లేదు

  • హిల్డ్‌ పాలసీతో హైదరాబాద్‌లో కూలీల ఉపాధికి ప్రమాదం

  • జీహెచ్‌ఎంసీ విస్తరణతో పాలనాపరమైన సమస్యలు వస్తాయి

  • మేడారం జాతరకు జాతీయహోదా ఇవ్వటం సాధ్యంకాదు: కిషన్‌రెడ్డి

వరంగల్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి విమర్శించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్‌, రేవంత్‌రెడ్డిల్లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయింపులు కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సాహించదని స్పష్టంచేశారు. తమ పార్టీలోకి ఎవరు వచ్చినాపదవులకు రాజీనామా చేసి రావాల్సిందేనని తెలిపారు. కిషన్‌రెడ్డి శనివారం వరంగల్‌ నగరంలో పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల కోసమే తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు నాటకమాడిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలకు ఇస్తామన్న 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు కేటాయించిందని విమర్శించారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించి మోసం చేసిన బీఆర్‌ఎ్‌సకు రిజర్వేషన్లపై మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. హైదరాబాద్‌ నగరంలోని 22 పరిశ్రమలను ఔటర్‌ రింగ్‌రోడ్డు బయటకు పంపేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఏకపక్షంగా తీసుకొస్తున్న హిల్డ్‌ పాలసీతో కూలీలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నిర్ణయం వల్ల పాలనాపరమైన సమస్యలు వస్తాయని తెలిపారు. టెక్స్‌టైల్‌ పార్కులోకి మరిన్ని కంపెనీలు.. పీఎం మిత్ర పథకం ద్వారా దేశంలో ఏడు టెక్స్‌టైల్‌ పార్కులను ఏర్పాటు చేస్తే.. అందులో తెలంగాణ నుంచి వరంగల్‌లోని కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కును ఎంపిక చేశామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఈ పార్కులో కైటెక్స్‌, యంగ్‌వన్‌, గణేశా కంపెనీలు యూనిట్లను ఏర్పాటుచేశాయని, త్వరలో మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కాజీపేటలో 160 ఎకరాల్లో నిర్మిస్తున్న రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ (ఆర్‌ఎంయూ) పనులను వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో రూ.1.26 లక్షల కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోందని వివరించారు. ఏప్రిల్‌దాకా పత్తి కొనుగోళ్లు రైతులు తొందరపడి ప్రైవేటు వ్యాపారులకు పత్తిని విక్రయించవద్దని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. సీసీఐ వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌ వరకు కూడా పత్తి కొనుగోలు చేస్తుందని తెలిపారు. దేశంలో అత్యధికంగా తెలంగాణ నుంచే గత ఏడాది 41 లక్షల బేళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులకు ఎకరానికి ఏడు క్వింటాళ్ల కంటే ఎక్కువ దిగుబడి వస్తే, సంబంధిత మండల వ్యవసాయ అధికారితో ధృవీకరణ పత్రం తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. రైల్వేస్టేషన్‌లో చాయ్‌ పే చర్చ.. వరంగల్‌ పర్యటనలో కిషన్‌రెడ్డి శనివారం రోజంతా బిజీబిజీగా గడిపారు. హైదరాబాద్‌ నుంచి వందేభారత్‌ రైళ్లో ఉదయం ఆరు గంటలకువరంగల్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకొని ప్రయాణికులతో చాయ్‌ పే చర్చ నిర్వహించారు.


అక్కడి నుంచి భద్రకాళి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం వేయిస్తంభాల గుడిలో కల్యాణ మండపం పనులు పరిశీలించి, పూజలు చేశారు. హరిత కాకతీయ హోటల్‌లో వరంగల్‌ స్మార్ట్‌ సిటీ, హృదయ్‌, హెరిటేజ్‌ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. మధ్యాహ్నం 1 గంటకు కాజీపేటలోని రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను సందర్శించారు. మఽధ్యాహ్నం 3 గంటలకు హరిత హోటల్‌లో జాతీయ రహదారులు, సీసీఐ అధికారులతో వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సాయంత్రం 4.25 గంటలకు మీడియాతో మాట్లాడిన తనంతరం రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. మేడారం జాతరకు నిధులు ఇప్పించేందుకు కృషి మేడారం మహా జాతరకు జాతీయ హోదా ఇచ్చే అవకాశం లేదని కిషన్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘మేడారం జాతరకు జాతీయ హోదాపై మీనమేషాలు’ శీర్షికన వచ్చిన కథనంపై ఆయన స్పందిస్తూ.. దేశంలో ఏ దేవాలయానికి, జాతరలకు, ఉత్సవాలకు జాతీయ హోదా ఇవ్వలేదని చెప్పారు. మేడారం జాతరకు కూడా జాతీయ హోదా ఇవ్వడం కుదరదని స్పష్టంచేశారు. గతంలో తాను కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మేడారం జాతర కోసం రూ.18 కోట్ల వరకు నిధులు కేటాయించానని, ఈసారి కూడా నిధుల కోసం కేంద్ర గిరిజన, పర్యాటక శాఖల మంత్రులకు లేఖలు రాసినట్లు వెల్లడించారు.

Updated Date - Nov 30 , 2025 | 07:14 AM