Share News

Deputy CM Batti: గ్రిడ్‌ రక్షణకు థర్మల్‌ విద్యుత్‌

ABN , Publish Date - Nov 30 , 2025 | 07:22 AM

రాష్ట్ర ప్రయోజనాలే ప్రామాణికంగా విద్యుత్‌ రంగంలో నిర్ణయాలు తీసుకుంటున్నామని, వ్యక్తిగత ప్రయోజనాలకు తావులేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు.

Deputy CM Batti: గ్రిడ్‌ రక్షణకు థర్మల్‌ విద్యుత్‌

హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రయోజనాలే ప్రామాణికంగా విద్యుత్‌ రంగంలో నిర్ణయాలు తీసుకుంటున్నామని, వ్యక్తిగత ప్రయోజనాలకు తావులేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అవగాహన లేని నాయకుల వల్లే విద్యుత్‌ రంగంలో సరైన ప్రణాళిక అమలు కాలేదన్నారు. దీనికోసం రాష్ట్రంలో రామగుండం, పాల్వంచలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు కట్టాలని నిర్ణయించామని చెప్పారు. గ్రిడ్‌ రక్షణకు థర్మల్‌ విద్యుత్‌ కూడా అవసరమని, పూర్తిగా సంప్రదాయేతర ఇంధన వనరులపై ఆధారపడటంతో ఏప్రిల్‌లో గ్రిడ్‌ కుప్పకూలి స్పెయిన్‌, పోర్చుగల్‌ వంటి దేశాల్లో చీకట్లు అలుముకున్నాయన్నారు. గ్రిడ్‌ కుప్పకూలితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రోజుకు రూ.1500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల దాకా నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యుత్‌ డిమాండ్‌, తీసుకోనున్న చర్యలపై భట్టి.. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఆరోపణలను ఖండించారు. రాష్ట్రం బాగుపడి, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మంచి పేరు రావడం బీఆర్‌ఎ్‌సకు ఇష్టం లేదని, అందుకే సంకుచిత స్వభావంతో ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక విజన్‌ లేకుండా రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారని, వారు రాజకీయాలకు పనికి రారని విమర్శించారు. దేశంలో థర్మల్‌ వాటా 2035 కల్లా 3.50 లక్షల మెగావాట్లు ఉండాలని సీఈఏ అంచనా వేసిందని, ఇందులో రాష్ట్రం వాటా 5 వేల నుంచి 6 వేల మెగావాట్లు ఉండాలని తెలిపారు. పిట్‌హెడ్‌ (బొగ్గు గని ఉపరితలం) భాగంలోనే ప్లాంట్లు కడతామని తెలిపారు. థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణంలో తొలి ప్రాధాన్యంఎన్‌టీపీసీకే ఇస్తున్నామని, ఎన్‌టీపీసీ, జెన్‌కోల్లో ఏదీ తక్కువ ధరకు కడితే వాటికే నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు.


ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను నిర్మించడం ప్రభుత్వ ఉద్దేశమని, దీనికోసం శ్రేయోభిలాషుల సహకారం తీసుకుంటామని, బీఆర్‌ఎ్‌సలా తప్పిదాలు చేయబోమన్నారు.బీఆర్‌ఎస్‌ హయాంలో సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో కాకుండా కాలంచెల్లిన సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్‌ చేపట్టారని, ఇండియాబుల్స్‌ కోసం కొని వదిలేసిన టర్బైన్లు, జనరేటర్లు వినియోగించారని విమర్శించారు. దీనివల్ల బొగ్గు వినియోగంతో పాటు కాలుష్యం పెరగడం, నిర్వహణ సమస్యలతో జెన్‌కోపై ఏటా భారం పడుతుందన్నారు. రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ గణనీయంగా పెరుగుతోందని చెప్పారు. 2014లో రాష్ట్ర అత్యధిక డిమాండ్‌ 6,755 మెగావాట్లు ఉంటే 2024-25 కల్లా 17,162 మెగావాట్లకు చేరిందన్నారు. రాష్ట్ర డిమాండ్‌ 2047 కల్లా 1.38 లక్షల మెగావాట్లకు చేరే అవకాశం ఉందన్నారు. కేంద్ర విద్యుత్‌ శాఖ ఆదేశాల ప్రకారం మొత్తం విద్యుత్‌లో సంప్రదాయేతర ఇంధన వనరుల వాటా 43.33శాతం ఉండాలని, అదే 2030కల్లా 50 శాతం, 2070కల్లా నెట్‌ జీరో (కర్బన ఉద్గారాలు లేని విద్యుత్‌) లక్ష్యం సాధించాల్సి ఉంటుందని తెలిపారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. రాష్ట్రంలో 10-12 చోట్ల పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్‌ కేంద్రాలకు అనుకూలత ఉందన్నారు. ఈ కేంద్రాల నిర్మాణం చేపడితే పూర్తి కావడానికి ఆరేళ్లు పడుతుందన్నారు. ముందుచూపు లేనందువల్లే ఏపీ పంప్డ్‌ స్టోరేజీ ప్లాంట్లు కట్టుకుందని, మార్కెట్‌లో దొరికే చవకైన విద్యుత్‌ను నిల్వ చేసుకోవడానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ‘విద్యుత్‌ విచారణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ మదన్‌ భీంరావు లోకూర్‌ నివేదికపై ఏం చేశారు? ఆ నివేదికలో ఏముంద’ని ప్రశ్నించగా నివేదికను న్యాయ నిపుణుల పరిశీలనకు పంపించామని, వారి నివేదిక వచ్చిన తర్వాత వాస్తవాలు బయటపడతాయని భట్టి వెల్లడించారు. ఒకే ప్రాంతంలో పలు డిస్కమ్‌లకు లైసెన్స్‌ ఇచ్చేలా కేంద్రం విద్యుత్‌ సవరణ చట్టం ముసాయిదాపై స్పందిస్తూ దానిపై అధ్యయనం చేశాకే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.


  • 3వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్‌

  • పోటీ బిడ్డింగ్‌లో టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం అనుమతి

హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాబోయే ఐదేళ్ల కాలంలో రాష్ట్ర విద్యుత్‌ అవసరాలను తీర్చడానికి, సంప్రదాయేతర ఇంధన వనరుల వాటా (రెన్యూవబుల్‌ పవర్‌ అబ్లికేషన్‌-ఆర్‌పీవో) లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 3 వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ కొనుగోలుకు అనుమతినిచ్చింది. ఈ మొత్తం విద్యుత్‌ను ఏకకాలంలో కాకుండా, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా దశలవారీగా కొనుగోలు చేయనున్నారు. 2026 జూన్‌ నాటికి 1,000 మెగావాట్లు, 2026 డిసెంబరు నాటికి మరో 1,000 మెగావాట్లు, 2027 జూన్‌ నాటికి చివరి 1,000 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తారు. ఈ ప్రక్రియ కోసం తక్షణమే టెండర్లు పిలవాలని తెలంగాణ రెడ్‌కో వీసీఎండీ, డిస్కమ్‌ల సీఎండీలను ఆదేశిస్తూ, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిట్టల్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2030 నాటికి రాష్ట్రానికి మొత్తం 12 వేల మెగావాట్ల సంప్రదాయేతర ఇంధన విద్యుత్‌ అవసరమవుతుందని అంచనా వేయగా, ఇందులో 5 వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ కొనుగోలు చేయడానికి అవకాశం ఇవ్వాలని రెడ్‌కో గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. దీనిపై చర్చించిన ప్రభుత్వం ఐదేళ్లకాలానికి 3 వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ను పోటీ బిడ్డింగ్‌ ద్వారా కొనుగోలు చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.


బొగ్గు రవాణాకే ఏటా రూ.1600 కోట్లు: శ్రీధర్‌బాబు

పిట్‌హెడ్‌ ప్లాంట్లు కట్టాలని సీఈఏ చెబుతున్నప్పటికీ నాన్‌-పిట్‌ హెడ్‌ ప్లాంట్లనే బీఆర్‌ఎస్‌ కట్టిందని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌.. బొగ్గు గనులకు 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, దీనివల్ల ఏటా బొగ్గు రవాణాకే రూ.1,600 కోట్ల భారం పడుతుందన్నారు. 25 ఏళ్లలో ప్రజలపై రూ.40 వేల కోట్ల భారం పడనుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ఆరోపణలపై స్పందిస్తూ రెండు థర్మల్‌ యూనిట్లు (ఒక్కోటి 800 మెగావాట్లు) కట్టడానికి రూ.22 వేల కోట్లలోపే అవుతుందని, అలాంటిది రూ.50 వేల కోట్ల కుంభకోణం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. పచ్చకామెర్లు వచ్చినోళ్లకు లోకమంతా పచ్చగానే కనిపించినట్లుగా బీఆర్‌ఎస్‌ నేతల వైఖరి ఉందని మండిపడ్డారు. నిర్మాణాత్మక విమర్శలు చేస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో ఇక ముందు సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో పిట్‌హెడ్‌లోనే ప్లాంట్లు కడతామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Kishan Reddy: ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు లేదు

Cardiac Arrest: గుండెపోటుతో ఇద్దరి మృతి

Updated Date - Nov 30 , 2025 | 07:35 AM