Share News

Cardiac Arrest: గుండెపోటుతో ఇద్దరి మృతి

ABN , Publish Date - Nov 30 , 2025 | 07:30 AM

పెళ్లయిన 20 ఏళ్లకు పుట్టిన కూతురికి అన్నప్రాశన చేయించిన రోజే ఓ కానిస్టేబుల్‌ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.

Cardiac Arrest: గుండెపోటుతో ఇద్దరి మృతి

  • వాకింగ్‌ చేస్తుండగా కుప్పకూలిన కానిస్టేబుల్‌

  • బస్సు నడుపుతూ స్టీరింగ్‌పై ఒరిగిన డ్రైవర్‌

సత్తుపల్లిరూరల్‌/జిన్నారం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): పెళ్లయిన 20 ఏళ్లకు పుట్టిన కూతురికి అన్నప్రాశన చేయించిన రోజే ఓ కానిస్టేబుల్‌ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. మరో ఘటనలో బస్సు నడుపుతూ డ్రైవర్‌.. స్టీరింగ్‌పైనే పడి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శుక్రవారం రాత్రి జరిగిన ఘటనలో నల్లబోయిన హనుమంతరావు(40) అనే ఏఆర్‌ కానిస్టేబుల్‌ మరణించాడు. సత్తుపల్లి మండలం గంగారంలోని15వ బెటాలియన్‌లో 2007నుంచి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న హనుమంతరావుకు 20ఏళ్ల క్రితం విజయతో వివాహమైంది. వారికి ఆరు నెలల క్రితం ఆడపిల్ల పుట్టింది. శుక్రవారం ఆ తల్లిదండ్రులు.. ఏపీలోని ద్వారకా తిరుమల ఆలయంలో చిన్నారికి అన్నప్రాశన చేశారు. అనంతరం రాత్రికి సత్తుపల్లికి చేరుకున్న హనుమంతరావు కుటుంబంతో కలిసి భోజనం చేశాడు. అనంతరం ముందు ఇంటి వాకింగ్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా హనుమంతరావు గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఇక, సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం అండూరులో శనివారం ఉదయం జరిగిన ఘటనలో కృష్ణ (56) అనే డ్రైవర్‌ బస్సు నడుపుతుండగా గుండెపోటుతో మరణించాడు. సంగారెడ్డి ఎస్‌వీ కళాశాలకు చెందిన బస్సు శనివారం ఉదయం అండూరు నుంచి కళాశాలకు విద్యార్థులతో బయలుదేరింది. బస్సు బయలుదేరిన కాసేపటికే డ్రైవర్‌ కృష్ణ (56) గుండెపోటుకు గురై స్టీరింగ్‌పై కూలిపోయి ప్రాణం వదిలాడు. అదుపు తప్పిన బస్సు అదృష్టవసాత్తు రోడ్డు పక్కన విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది.

Updated Date - Nov 30 , 2025 | 07:30 AM