Musi River Development Project: మూసీ అభివృద్ధిలో మరో కీలక అడుగు..
ABN , Publish Date - Oct 28 , 2025 | 09:31 AM
మూసీ అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్‌ను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. నవంబర్‌లో డీపీఆర్‌ను కేంద్రానికి పంపే యోచనలో ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్, అక్టోబర్ 28: మూసీ అభివృద్ధి, పునరుజ్జీవాన్ని (Musi River Development Project) రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా మూసీ అభివృద్ధికి సంబంధించి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్ఆర్టీసీఎల్‌కు 734.07 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పలు ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూములను ఇప్పుడు మూసీ కార్పొరేషన్‌కు అప్పగించారు. హిమాయత్‌సాగర్, బుద్వేల్, రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాల భూములను మూసీకి బదలాయించింది. టీఈఈఆర్‌ఎల్, ఐఐపీహెచ్, వాలంతరి వంటి సంస్థలకు కేటాయించిన భూములతో పాటు, శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో హెచ్‌ఎండీఏ లేఅవుట్ కోసం కేటాయించిన భూమిని కూడా మూసీ ప్రాజెక్టు కోసం బదలాయించారు.
అలాగే ఏడీబీతో రూ.4,100 కోట్ల రుణ ఒప్పందాన్ని పూర్తి చేసింది. మూసీ ప్రాజెక్ట్ కోసం కేంద్రం సూత్రపాయ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మూసీ అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్‌ను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. నవంబర్‌లో డీపీఆర్‌ను కేంద్రానికి పంపే యోచనలో ఉన్నట్లు సమాచారం. భూములు కోల్పోయిన సంస్థలకు ఫ్యూచర్ సిటీలో ప్రత్యామ్నాయ భూమి కేటాయింపులకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. కాగా.. మూసీ నది ప్రక్షాళన కోసం ప్రభుత్వం గతంలో భారీగా నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. దాదాపు రూ.375 కోట్ల నిధులు కేటాయిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నదీ పరివాహక ప్రాంతాల్లో అనధికారిక నిర్మాణాలను తొలగించడంతో పాటు నదిలో పేరుకుపోయిన చెత్తను కూడా శుభ్రం చేసే పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. మూసీ పునరుజ్జీవం 55 కిలోమీటర్ల మేర దూరం చేయాల్సి ఉండగా, రెండు వైపులా కలిపి 110 కి.మీ మేర అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా నదికి రెండు వైపులా రోడ్లు, సైకిల్ ట్రాక్‌లు, వాకింగ్ పాథ్‌లు, పార్కులు, పచ్చని ప్రదేశాలను ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి...
రైలు, విమాన సర్వీసులకు బ్రేక్
Read Latest Telangana News And Telugu News