Share News

ED On Bhoodan Lands: భూదాన్ భూములు.. ఈడీ కీలక నిర్ణయం..

ABN , Publish Date - Sep 01 , 2025 | 04:48 PM

తెలంగాణలో సంచలనం సృష్టించిన భూదాన్ భూముల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును ముమ్మరం చేసింది. అందులోభాగంగా ఈడీ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.

ED On Bhoodan Lands: భూదాన్ భూములు.. ఈడీ కీలక నిర్ణయం..
ED

హైదరాబాద్, సెప్టెంబర్ 01: తెలంగాణలో సంచలనం సృష్టించిన భూదాన్ భూముల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును ముమ్మరం చేసింది. అందులోభాగంగా మహమ్మద్ మునావర్ ఖాన్, అతడి భార్య ఫైకా తహాఖాన్‌కు సంబంధించిన రూ. 4.80 కోట్లు విలువైన ఆస్తులను ఈడీ సోమవారం జప్తు చేసింది. బంజారాహిల్స్, శంషాబాద్, టోలిచౌక్‌లో ఉన్న వీరి ఆస్తులను జప్తు చేసింది. ప్రభుత్వ భూమిని అక్రమంగా విక్రయించడమే కాకుండా.. పత్రాలను వీరు ఫోర్జరీ చేసినట్లు గుర్తించింది.

అలాగే మహమ్మద్ మునావర్ ఖాన్‌తోపాటు అతడిని సహకరించిన.. ప్రభుత్వ అధికారులపై సైతం మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. నాగారవం సర్వే నెంబర్ 181లో భూదాన్ భూమిని ఖాదర్ ఉనిస్సా రెవిన్యూ రికార్డులు మార్చినట్లు ఇప్పటికే గుర్తించారు. ఈ రెవెన్యూ రికార్డులు మార్చిన భూమిని మోసపూరితంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు విక్రయించినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. ఇక మనీలాండరింగ్ కింద వీరిపై ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.


ఇంతకీ ఏం జరిగిందంటే..

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారంలోని 181, 182 సర్వే నెంబర్‌లో సుమారు 103 ఎకరాలు భూదాన్ భూమి ఉంది. ఈ భూమిపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. అందులో సుమారు 50 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినట్లు సమాచారం. ఈ 50 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో.. వారు అందులో ప్లాట్లుగా విభజించి.. విక్రయాలు చేపట్టారు. అయితే ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. దీంతో ఈ భూములకు సంబంధించి లావాదేవీలపై కోర్టు స్టే విధించింది. ఇక ఈ అంశంలో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారినట్లు.. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు గుర్తించారు.


ఆ క్రమంలో భూదాన్ భూమి వ్యవహారంలోనే గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పని చేసిన అమయ్ కుమార్‌‌కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి పలు మార్లు విచారించింది. అలాగే అప్పటి ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు ఇచ్చి వారిని కూడా ఈడీ విచారించింది. భూదాన్ భూముల్లో ఎవరెవరైతే ప్లాట్లు కొనుగోలు చేశారో.. వాటిని రియల్ ఎస్టేట్ కంపెనీలకు విక్రయించారో, వారిపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. అందులోభాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో పాతబస్తీలో ముమ్మర సోదాలు నిర్వహించారు.


ప్రధానంగా పాతబస్తీలోని మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా, సర్ఫాన్ నివాసాల్లో సోదాలు చేపట్టిన విషయం విదితమే. ఈ కేసులో ఖదీర్ ఉన్నీసా పాత్ర చాలా కీలకమని గుర్తించినట్లు తెలుస్తోంది. ఖదీర్ ఉన్నీసా తండ్రి ఈ 50 ఎకరాల భూమిని గతంలో భూదాన్ బోర్డుకు దానంగా ఇచ్చారు. 2021లో ఈ ఖదీర్‌ ఉన్నీసా తన తండ్రికి వారసురాలు తానే అంటూ వచ్చి 50 ఎకరాలు తనకు బదిలీ చేయాలంటూ అర్జీ పెట్టుకుంది. ఆ వెంటనే ఆగమేఘాల మీద రెవెన్యూ అధికారులు 50 ఎకరాల భూమిని ఖదీర్ ఉన్నీసా పేరు మీద రిజిస్ట్రర్ చేశారు.


ఆ సమయంలో జిల్లా కలెక్టర్‌గా అమయ్ కుమార్‌తో పాటు కిందస్థాయి సిబ్బంది కూడా హడావుడిగా.. ఎలాంటి విచారణ జరుపకుండా ఈ 50 ఎకరాల భూమిని ఖదీర్ ఉన్నిసా పేరు మీద బదిలీ చేశారు. ఈ విషయాన్ని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఖదీర్ ఉన్నిసాతో పాటు మరికొంత మంది 50 ఎకరాల భూమిని ప్లాట్లుగా విభజించి చాలా మందికి విక్రయించిన సంగతి తెలిసిందే.


అయితే ఈ భూములు కొనుగోలు చేసిన వారిలో.. ప్రజాప్రతినిధులు, ఐఏఎస్‌‌లు, ఐపీఎస్‌లు ఉన్నారని తెలుస్తోంది. అయితే నాగారం, మహేశ్వరం ప్రాంతాల్లో భూముల రేట్లు భారీగా ఉన్నాయి. మరో వైపు భూదాన్‌‌కు సంబంధించి భూములు క్రయ విక్రయాలు చేసేందుకు అవకాశం ఉండదు.


ఈ క్రమంలో ఖదీర్ ఉన్నిసాకు త్వరిత గతిన భూమిని రిజిస్ట్రేషన్ చేయడం వెనక కారణాలేంటి అనే దానిపై ఇప్పటికే అధికారులు పలు మార్లు విచారణ జరిపి.. అప్పటి కలెక్టర్ అమయ్ కుమార్‌తో పాటు మిగిలిన వారి వద్ద స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే ప్లాట్లు విక్రయించారో, ఎవరైతే భూములు కొనుగోలు చేశారో వారి ఇళ్లను టార్గెట్ చేసుకుని సోదాలు కొనసాగించిన విషయం విదితమే.

Updated Date - Sep 01 , 2025 | 04:59 PM