Minister Seethakka: బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఫైర్.. బుద్ధి మార్చుకోవాలని హితవు.!
ABN , Publish Date - Nov 26 , 2025 | 03:00 PM
కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన చీరల పంపిణీ కార్యక్రమంపై బీఆర్ఎస్ నేతలు అనవసరంగా బురద జల్లుతున్నారంటూ మంత్రి సీతక్క మండిపడ్డారు. తాము ఎంతో నాణ్యమైన చీరలు అందజేస్తున్నా.. అవి బాగాలేవని ప్రజల్లో దుష్ప్రచారం కల్పించడం తగదన్నారు.
హైదరాబాద్, నవంబర్ 26: రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన చీరల పంపిణీ కార్యక్రమంపై బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేయడం తగదంటూ రాష్ట్ర మంత్రి సీతక్క మండిపడ్డారు. ఆడబిడ్డలు, మహిళా సంఘాలు ఎంపిక చేసుకున్న డిజైన్లలోనే చీరలను ఇస్తున్నామని.. దీనిపై బీఆర్ఎస్ నాయకులు కలర్ బాగాలేదని, డిజైన్ బాగాలేదని విమర్శలు గుప్పించడం సరికాదన్నారు.
కేటీఆర్, హరీశ్ రావులే టార్గెట్‌గా..
ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే హరీశ్ రావులపై తీవ్రంగా ధ్వజమెత్తారు సీతక్క. సహజంగానే ఆడవాళ్లు ఎదుగుతుంటే.. వాళ్లిద్దరూ ఓర్వలేకపోతున్నారన్నారు. ఆడబిడ్డలు చీరలు తీసుకుని ఎంతగానో సంబరపడుతుంటే అవి వాళ్ల కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మహిళలు సంతోషంగా ఉండటంతో వారు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ గతంలో ఇచ్చినట్టుగా.. తామేమీ సూరత్ నుంచి కిలోల లెక్కన తీసుకురాలేదని, సిరిసిల్ల నేతన్నలు తమ చేతులతో స్వయంగా నేసిన చీరలనే పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. కావాలంటే కేటీఆర్, హరీశ్ రావు, కవితలు.. సిరిసిల్ల వెళ్లి అక్కడి చేనేత కార్మికులను అడిగి వివరాలు తెలుసుకోవచ్చని స్పష్టం చేశారామె. కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎంతో నాణ్యతతో కూడిన చీరలను పంచుతుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కావాలనే అవి బాగాలేవని మాట్లాడటం సిరిసిల్ల నేతన్నలను అవమానించినట్లు అవుతుందన్నారు.
చీరల్ని కొందరికే ఇస్తున్నామన్న బీఆర్ఎస్ నేతల ఆరోపణల్ని ఖండించిన మంత్రి.. మహిళా సంఘాల సభ్యులతో పాటు సభ్యత్వంలేని మహిళలనూ సంఘంలోకి ఆహ్వానిస్తూ చీరలు అందజేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఏం చేసినా.. ప్రతిపక్ష నేతలు ఓర్చుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. అలాగే ఫ్రీ బస్సు పెడితే బ్రేక్ డాన్స్ చేసుకోవాలని, మహిళలు కొట్టుకుంటున్నారని దుష్ప్రచారం చేశారని ఆమె గుర్తుచేశారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా బుద్ధి మార్చుకుంటే బావుంటుందని సూచించారామె. మహిళలకు మంచి జరుగుతుంటే స్వాగతించడం, సంతోషించడం నేర్చుకోవాలని హితవు పలికారు.
ఇవీ చదవండి: