Hydrozen Gas: హైడ్రోజన్ బెలూన్లు వాడుతున్నారా.. అయితే జాగ్రత్త సుమీ.!
ABN , Publish Date - Nov 26 , 2025 | 02:12 PM
హైడ్రోజన్ అనేది చాలా తేలికైన వాయువు. ప్రకృతిలో సమృద్ధిగా లభించే దీన్ని.. బెలూన్లలోనూ ఉపయోగిస్తున్నారు. అయితే.. వీటి నిర్వహణలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే.. ఎందుకు దీనిపై అప్రమత్తత అవసరం.? ఈ వాయువు వల్ల కలిగే లాభ నష్టాలేంటి? ఓ సారి తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల జరిగిన ఓ హల్దీ వేడుకలో హైడ్రోజను బెలూన్లు ఉన్నట్టుండి ఒక్కసారిగా పేలిపోయాయి. అట్టహాసంగా జరుగుతున్న ఆ కార్యక్రమంలో ఈ బెలూన్లు ఆకస్మికంగా పేలడంతో ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడి వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అంతటి భయానక వాతావరణం సృష్టించిన ఈ హైడ్రోజన్ వాయువులో ఇంతకీ ఏముందంటే..
హైడ్రోజన్.. ఇది అత్యంత తేలికైన వాయువు. రంగు, రుచి, వాసనలేని గుణాలతో పాటు మండే స్వభావమూ దీని సొంతం. విశ్వంలో అపరిమితంగా లభించే ఈ స్వచ్ఛమైన ఇంధనం.. నీటితో పాటు అనేక జీవ పదార్థాల్లో మిళితమై ఉంటుంది. శుభ్రమైన ఇంధన వనరుగా హైడ్రోజన్‌ను ఉపయోగిస్తారు. అయితే.. దీని నిర్వహణలో కాస్తంత నిర్లక్ష్యం వహించినా మంటలు, పేలుళ్లకు కారణం అవుతుంది. గాలికంటే తేలికైన వాయువు కాబట్టి లీక్ అయిన వెంటనే చెల్లాచెదురు అవుతుంది. ఇది విషరహితం కనుక మానవ ఆరోగ్యానికి అంతగా హానికరం కాదు. అయితే.. అధిక సాంద్రతలో పీల్చినప్పుడు ఆక్సిజన్‌ను స్థానభ్రంశం చేసి ఊపిరాడకపోవడానికీ దారితీయవచ్చు.
హైడ్రోజన్ ఉత్పత్తి:
సహజ వాయువు సంస్కరణ (స్టీమ్ మీథేన్ రీఫార్మింగ్): ఇది అత్యంత సాధారణ పద్ధతి. ఈ ప్రక్రియలో సహజ వాయువును ఆవిరితో అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు.
ఎలక్ట్రోలైసిస్: ఈ ప్రక్రియలో నీటిని విద్యుత్ సాయంతో హైడ్రోజన్, ఆక్సిజన్‌లుగా విడదీస్తారు. సౌర, పవన శక్తి ద్వారా దీనిని ఉత్పత్తి చేస్తే.. గ్రీన్ హైడ్రోజన్‌గా వ్యవహరిస్తారు.
బయోమాస్ గ్యాసిఫికేషన్: బయోమాస్(సేంద్రీయ పదార్థాలు) నుంచీ ఈ వాయువును ఉత్పత్తి చేస్తారు.
హైడ్రోజన్ ఉపయోగాలు:
ఇది శుభ్రమైన ఇంధన వనరు. దీనిని ఇంధన కణాలలో(fuel cells) ఉపయోగించినప్పుడు నీటిని మాత్రమే ఉప ఉత్పత్తిగా విడుదల చేస్తుంది. ఎలాంటి కాలుష్యం ఉండదు. రవాణా, విద్యుత్ ఉత్పత్తికీ దీనిని వినియోగిస్తారు.
పెట్రోలియం శుద్ధి, అమ్మోనియా సంబంధిత ఎరువుల ఉత్పత్తి, గ్లాస్ పరిశుభ్రత, మెటలర్జీ, ప్లాస్టిక్ తయారీ వంటి పారిశ్రామిక రంగాలలో దీనిని విస్తృతంగా వాడతారు.
పవర్ ప్లాంట్ జనరేటర్‌లలో హైడ్రోజన్‌ను కూలెంట్‌గా ఉపయోగిస్తారు.
హైడ్రోజన్ నష్టాలు:
హైడ్రోజన్ వాయువుకు మండే స్వభావం ఎక్కువ. కాబట్టి నిర్వహణలో అజాగ్రత్తగా ఉంటే మంటలు, పేలుళ్లకు దారితీసే అవకాశముంది.
హైడ్రోజన్ చాలా తేలికైనది. కాబట్టి దీనిని అధిక పీడనం లేదా ద్రవ రూపంలో నిల్వ చేయడం కష్టం. పైగా ఖర్చుతో కూడుకున్న పని. లీకేజీ అవకాశాలూ అధికమే.
హైడ్రోజన్ వాయువును శిలాజ ఇంధనాలకు భవిష్యత్ ప్రత్యామ్నాయంగానే కాకుండా వాతావరణ మార్పులకూ మంచి పరిష్కార మార్గంగానూ వాడుతున్నారు.
ఇవీ చదవండి: