Jennifer Lopez: ఉదయ్‌పుర్ వేడుకలో మెరిసిన జెన్నిఫర్ లోపెజ్.. ప్యాకేజీ ఎంతంటే..
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:53 PM
ఉదయ్‌పుర్‌లో ఇటీవల అట్టహాసంగా జరిగిన ఓ ఎన్నారై కుమార్తె వివాహానికి అమెరికన్ హాలీవుడ్ తార జెన్నిఫర్ లోపెజ్ హాజరయ్యారు. అయితే ఈ వేడుకకు వచ్చేందుకు ఆమె తీసుకున్న ప్యాకేజీయే ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో దీని గురించే అందరూ చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఇటీవల జరిగిన ఓ ఎన్ఆర్ఐ కుమార్తె వివాహానికి అమెరికన్ హాలీవుడ్ తార జెన్నిఫర్ లోపెజ్ భారీ పారితోషికాన్ని పొందినట్టు సమాచారం. ఉదయపుర్ వేదికగా జరిగిన ఈ వేడుకకు హాజరైన ఆమె.. సుమారు రూ.17 కోట్లు తీసుకున్నారట. అయితే.. సుమారు పదేళ్ల క్రితం.. ఉదయ్‌పుర్‌లోని తాజ్ లేక్ ప్యాలెస్ వేదికగా జరిగిన ఓ వివాహ వేడకకు వచ్చినప్పుడు సుమారు రూ.6.5 కోట్లు పుచ్చుకున్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఇలా దశాబ్ద కాలంలో ఒకే వేదికపై రెండు ప్రముఖ వివాహాలకు విచ్చేసిన లోపెజ్.. సుమారు రూ.23.5 కోట్ల మొత్తాన్ని ఆర్జించినట్టు తెలుస్తోంది. ఈమె తీసుకునే పారితోషకం వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వగా.. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
అయితే.. ఈ వివాహానికి సంబంధించిన లాజిస్టిక్స్‌నూ స్టార్లకు అనుగుణంగానే నిర్వహించారు. రూ.208 కోట్ల విలువైన చార్టర్డ్ విమానాల్లో అతిథులను తీసుకువచ్చారు. వందలాది మంది బీఎండబ్ల్యూ కార్లు ప్రైవేట్ డ్రైవర్లతో బయట పార్కింగ్‌లో ఉంచారు.
నవంబర్ 24న.. అమెరికన్ బిలీనియర్ రామరాజు మంతెన కుమార్తె నేత్ర పరిణయం వంశీ గాదిరాజుతో ఉదయ్‌పుర్‌లో నాలుగు రోజుల పాటు అట్టహాసంగా జరిగింది. జగ్ మందిర్ ప్యాలెస్‌లో అత్యంత వైభవంగా నిర్వహించిన ఈ వివాహానికి విచ్చేసిన అమెరికన్ పాప్ సింగర్, హీరోయిన్ జెన్నిఫర్.. గులాబీ-వర్ణంతో కూడిన భారతీయ వస్త్రధారణలో మెరిశారు. ఆమె రాకతో దేశంలో పెద్ద పెద్ద వేడుకలకు హాజరయ్యే వారూ షాకయ్యారు. అనంతరం బోల్డ్ దుస్తులతో వేడుకలో తళుక్కుమన్న ఆమె.. పూర్తిస్థాయి కచేరీని ప్రదర్శించారు. వెయిటింగ్ టు నైట్, గెట్ఆన్ ది ఫ్లోర్, ప్లే, సేవ్ మీ టునైట్ వంటి హిట్ ప్రదర్శనలతో అలరించారు. అనంతరం వేదికపై నవ వధూవరులను ఆశీర్వదిస్తూ.. 'ఈ అందమైన రోజున ఇరు కుటుంబాలూ ఐక్యంగా ఉండాలి. దేవుడు మనందరినీ దీవించాలి' అన్నారు. ఇలా ప్రపంచ వ్యాప్త వేడుకలా భావించిన ఈ వివాహానికి అంతర్జాతీయంగా భారీ గుర్తింపే వచ్చింది.
ఈ పెళ్లికి జెన్నిఫర్ లోపెజ్‌తో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు ట్రంప్ జూనియర్, ఇంటర్నేషనల్ స్టార్స్ జస్టిస్ బీబర్, బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్ వంటి ప్రముఖ తారలు ఈ వేడుకకు హాజరయ్యారు. నేత్ర మంతెన తండ్రి మంతెన రామరాజుది ఆంధ్రప్రదేశ్ మూలాలున్న అమెరికాకు చెందిన బిలియనీర్.
ఇవీ చదవండి: