TG Local Bodies Elections: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం..!
ABN , Publish Date - Nov 20 , 2025 | 06:45 PM
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కసరత్తు చేస్తోంది. వచ్చే వారం ఈ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, నవంబర్ 20: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమవుతోంది. నవంబర్ 26 లేదా 27వ తేదీన పంచాయతీ ఎన్నికల నగారా మోగనుందని తెలుస్తోంది. మొత్తం మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ ఎన్నికలను చాలా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ స్పష్టం చేసింది.
మరోవైపు.. పంచాయతీల్లో ఓటరు జాబితా మరోసారి సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) బుధవారం షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు అంటే.. గురువారం నుంచి నవంబర్ 23వ తేదీ వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించింది. 20వ తేదీన ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, తప్పుల సవరణ చేయనుంది. 21వ తేదీన ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరిస్తుంది. 23వ తేదీన ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రాణి కుముదిని ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.
డిసెంబర్ 1 నుంచి 9 వ తేదీ వరకు ప్రజా పాలన వారోత్సవాలు జరుగుతాయి. ఆ తర్వాత ఈ ఎన్నికల నిర్వహించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాయి. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తేనే.. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్రపతి ముర్ము పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
కోర్టుకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్
Read Latest TG News And Telugu News