Share News

KTR: ఇంత బతుకు బతికి ఏ పార్టీనో చెప్పుకునే దమ్ము లేదు: కేటీఆర్ ఫైర్

ABN , Publish Date - Dec 19 , 2025 | 03:34 PM

సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పర్యటించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను కేటీఆర్ ఈ సందర్బంగా ఘనంగా సన్మానించారు.

KTR: ఇంత బతుకు బతికి ఏ పార్టీనో చెప్పుకునే దమ్ము లేదు: కేటీఆర్ ఫైర్
BRS Working President KTR

సిరిసిల్ల, డిసెంబర్ 19: పది మంది ఎమ్మెల్యేలతో ఎన్నికలకు వెళ్లే దమ్ముందా? అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ విసిరారు. 66 శాతం జనం నీతోనే ఉంటే.. ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్‌కు ఆయన స్పష్టం చేశారు. పది మంది ఎమ్మెల్యేలు చెబుతున్నా.. అసెంబ్లీ స్పీకర్‌కు వినపడడం లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సిరిసిల్లలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పంచాయతీ సర్పంచ్‌లుగా నూతనంగా ఎన్నికైన వారిని కేటీఆర్ ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కడియం శ్రీహరి ఓపెన్‌గా చెప్పినా స్పీకర్‌కు కనపడలేదన్నారు. మాజీ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డిది కూడా ఓ బతుకేనా అంటూ మండిపడ్డారు.


స్పీకర్ ముందు ఎమ్మెల్యేలు అబద్ధం చెప్పారని చెప్పారు. స్పీకర్ కూడా అబద్ధాలు చెబుతారా? అంటూ కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, స్పీకర్‌ను చూస్తే జాలేస్తుందంటూ ఆయన వ్యంగ్యంగా అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆడోళ్లా? మగోళ్లో తెలియడం లేదన్నారు. ఇంత బతుకు బతికి ఏ పార్టీనో చెప్పుకునే దమ్ము లేదంటూ రాజకీయ కండువాలు మార్చిన ఎమ్మెల్యేలపై నిరసన వ్యక్తం చేశారు. పదవి కోసం.. చూరు పట్టుకుని గబ్బిలం లాగా వేలాడినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.


తెలంగాణలో ఇటీవల మూడు దశల్లో పంచాయతీ సర్పంచ్‌ల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది. ఇక సిరిసిల్ల నియోజకవర్గంలో మొత్తం 117 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. వాటిలో 60 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది.

Updated Date - Dec 19 , 2025 | 03:42 PM