Share News

Justice PC Ghose: పీసీ ఘోష్ కమిషన్ విచారణలో ఆసక్తికర సంఘటన

ABN , Publish Date - Feb 27 , 2025 | 03:28 PM

Justice PC Ghose: రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ రావుపై కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అడిగిన ప్రతి ప్రశ్నకు రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ రావు తెలియదు.. గుర్తు లేదంటూ సమాధానమిచ్చారు. దీంతో జస్టిస్ పీసీ ఘోష్ కొంత అసహనం వ్యక్తం చేస్తూ.. మీరు ఎప్పుడు విధుల నుంచి రిటైర్ అయ్యారంటూ మురళీధర్ రావును సూటిగా ప్రశ్నించారు.

Justice PC Ghose: పీసీ ఘోష్ కమిషన్ విచారణలో ఆసక్తికర సంఘటన
Justice PC Gosh

హైదరాబాద్, ఫిబ్రవరి 27: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ జరుపుతోన్న విచారణ గురువారం కాస్తా వాడి వేడిగా సాగింది. ఈ కమిషన్ ఎదుట రిటైర్డ్ ఈఎన్‌సీలు నల్ల వెంకటేశ్వర్లు, మురళీధర్ రావు, హరి రామ్, సీడీఓ మాజీ సీఈ నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. తొలుత నల్ల వెంకటేశ్వర్లను కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్.. క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఆ క్రమంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్ ఎందుకు మార్చారంటూ ఆయన్ని పీసీ ఘోష్ ప్రశ్నించారు. దీంతో నల్లా వెంకటేశ్వర్లు సమాధానమిస్తూ.. గ్రావిటీ కెనాల్ పొడవు తగ్గించడం, కెపాసిటీ పెంచడం, అటవీ భూముల సేకరణ తగ్గించడం, ఎత్తిపోతలు, విద్యుత్ భారం తగ్గించడానికి బ్యారేజిల నిర్మాణ స్థలాలను మార్చినట్లు కమిషన్‌కు ఆయన సోదాహరణగా వివరించారు.

అలాగే ఎవరి సూచనల మేరకు లొకేషన్ మార్చారంటూ మరో ప్రశ్నను ఆయనకు కమిషన్ సంధించింది. సీఈ నుంచి వచ్చిన సూచనల మేరకే బ్యారేజ్‌ నిర్మాణ స్థలాలు మార్చినట్లు తెలిపారు. ఇక ఎవరి ఆదేశాల మేరకు బ్యారేజీలో నీరు స్టోర్ చేశారంటూ కమిషన్ ప్రశ్నించగా.. నాటి సీఎం కేసీఆర్ సూచనల మేరకే నీటిని స్టోర్ చేశామని పేర్కొన్నారు.


అదే విధంగా పనుల ఆలస్యంగా చేసినందుకు ఏజెన్సీలకు ఎప్పుడైనా పెనాల్టీలు వేశారా? అని కమిషన్ ప్రశ్నించగా.. అలాంటి పని తాము ఎప్పుడు చేయలని కమిషన్ ఎదుట రిటైర్డ్ ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు సమాధానమిచ్చారు. బ్యారేజ్‌ల నిర్మాణ సమయంలో సరిగ్గా మానిటర్ చేయలేదని ఒప్పుకుంటారా ? అన్న కమిషన్ ప్రశ్నకు .. బ్యారేజ్ నిర్మాణ సమయంలో తాను తరచూ వెళ్లేవాడినని ఆయన స్పష్టం చేశారు.


మరోవైపు రిటైర్డ్ ఈఎన్‌సీ మురళీధర్ రావుపై కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అడిగిన ప్రతి ప్రశ్నకు రిటైర్డ్ ఈఎన్‌సీ మురళీధర్ రావు తెలియదు.. గుర్తు లేదంటూ సమాధానమిచ్చారు. దీంతో జస్టిస్ పీసీ ఘోష్ కొంత అసహనం వ్యక్తం చేస్తూ.. మీరు ఎప్పుడు విధుల నుంచి రిటైర్ అయ్యారంటూ మురళీధర్ రావును సూటిగా ప్రశ్నించారు.


తాను 2024, ఫిబ్రవరిలో రిటైర్డ్ అయ్యానంటూ మురళీధర్ రావు సమాధానమిచ్చారు. దీంతో మురళీధర్ రావుపై కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తాను ఇచ్చిన తీర్పులు ఇప్పటికీ తనకు గుర్తు ఉన్నాయన్నారు. మీరు అప్పుడే మరిచిపోయారా? అంటూ జస్టిస్ పీసీ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాను మెమొరీ లాస్ అయినట్లు మురళీధర్ రావు సమాధాన మిచ్చారు. దీంతో పుస్తకాలు చదవితే జ్ఞాపకశక్తి పెరుగుతుందంటూ రిటైర్డ్ ఈఎన్‌సీ మురళీధర్ రావుకు కమిషన్ సూచించింది.


గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. లక్షల కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు సదరు ప్రాజెక్ట్‌లోని పిల్లర్లు కృంగాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భారీగా అవినీతి చోటు చేసుకుందని.. అందుకే ఈ విధంగా కృంగిందంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పించాయి. అయితే తాము అధికారంలోకి వస్తే.. ఈ వ్యవహారంపై విచారణ చేపడతామంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చింది.


ఇంతలో ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం.. అ నాటి సంఘటనలపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో పాలు పంచుకొన్న ఉన్నతాధికారులను విచారిస్తోంది.

For Telangana News And Telugu News

Updated Date - Feb 27 , 2025 | 03:35 PM