Share News

Jubilee Hills Bypoll: ఇది భూకంపానికి ముందు వచ్చే చిన్న ప్రకంపన: సీఎం రేవంత్

ABN , Publish Date - Nov 14 , 2025 | 05:01 PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇచ్చారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎన్ని ఓటములు వచ్చినా .. కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య మనుగడ సాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Jubilee Hills Bypoll: ఇది భూకంపానికి ముందు వచ్చే చిన్న ప్రకంపన: సీఎం రేవంత్

హైదరాబాద్, నవంబర్ 14: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇచ్చారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్ని ఓటములు వచ్చినా .. కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య మనుగడ సాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్‌ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించి.. సన్మానించారు.


అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పోలైన ఓట్లలో దాదాపు 51 శాతం కాంగ్రెస్‌కు, 38 శాతం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు, 8 శాతం బీజేపీలకు వచ్చాయన్నారు. దీని ద్వారా తమ గత రెండేళ్ల పాలనను ప్రజలు పరిశీలిస్తున్నట్లు స్పష్టమైందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో పార్టీ గెలుపు.. తమ బాధ్యతను పెంచిందన్నారు.


అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో తమకు సానుకూల ఫలితాలు రాలేదని ఈ సందర్భంగా సీఎం రేవంత్ గుర్తు చేశారు. ప్రజల మన పని తీరును గమనించి తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అనేక సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. అయితే తమపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎవరి పాత్ర వారు పోషిద్దామని ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా ఆయన పిలుపు నిచ్చారు.


హైడ్రా, ఈగల్ వంటివి ప్రజల కోసం తీసుకు వచ్చామన్నారు. కానీ వాటిపైనే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ విష ప్రచారం ఆపాలంటూ బీఆర్ఎస్‌ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి బీఆర్ఎస్ అడ్డు తగులుతోందన్నారు. జూబ్లీహిల్స్‌లో తమ గెలుపు రెండేళ్ల పాలనకు ప్రతిఫలమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా అర్థం చేసుకుని సహకరించాలంటూ బీఆర్ఎస్, బీజేపీలకు సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు.


రాష్ట్రాభివృద్ధికి కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారని విమర్శించారు. కిషన్‌రెడ్డికి వచ్చిన ఓట్లలో 25 శాతం మాత్రమే ప్రస్తుతం వచ్చాయన్నారు. ఇది భూకంపానికి ముందు వచ్చే చిన్న ప్రకంపన లాంటిదని సీఎం రేవంత్‌ రెడ్డి అభివర్ణించారు. ఇప్పుడు అప్రమత్తం కాకపోతే కిషన్‌రెడ్డి భూ స్థాపితం అవుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలంటూ కిషన్ రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఎవరి పాత్ర ఏమిటో, ఎవరి బాధ్యత ఏమిటో ప్రజలు స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు.


హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అనుచిత భాషతో అబద్ధాలను బీఆర్ఎస్ ప్రచారం చేసిందని తెలిపారు. గంజాయి, డ్రగ్స్‌ను నియంత్రించడానికి ఈగల్ ఫోర్స్ తీసుకు వచ్చామని వివరించారు. కబ్జాలను అడ్డుకోవడానికి హైడ్రా తీసుకువచ్చామన్నారు. అయితే నగరాభివృద్ధికి బీఆర్ఎస్ సహకరించకపోగా అడ్డుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎన్నికలప్పుడే రాజకీయ విమర్శలు చేస్తామన్నారు.


తెలంగాణ సచివాలయానికి రావాలంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రంలో పెండింగ్ ఉన్న అంశాలపై చర్చిద్దామని కిషన్ రెడ్డిని కోరారు. ఈ మేరకు కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్ వివరాలపై ఉన్నతాధికారులతో సమీక్షించి నివేదిక సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను సీఎం రేవంత్ ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Bandi Sanjay: నేడు బిహార్.. రేపు బెంగాల్: కేంద్ర మంత్రి

MLC Kavitha Tweet Storm: కర్మ హిట్స్ బ్యాక్.. ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్..

Updated Date - Nov 14 , 2025 | 07:36 PM