Share News

Bandi Sanjay: నేడు బిహార్.. రేపు బెంగాల్: కేంద్ర మంత్రి

ABN , Publish Date - Nov 14 , 2025 | 06:32 PM

బిహార్‌లో స్వాతహాగా బీజేపీ 92 స్థానాల్లో గెలిచిందన్నారు. ఇక బిహార్‌లో కాంగ్రెస్ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీగా మారిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పని అయిపోయిందని.. ఇక ఆయన పబ్జి ఆడుకోవాలంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు.

Bandi Sanjay: నేడు బిహార్.. రేపు బెంగాల్: కేంద్ర మంత్రి

హైదరాబాద్, నవంబర్ 07: నేడు బిహార్‌లో విజయం సాధించామని.. రేపు పశ్చిమ బెంగాల్‌లో సైతం బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుతో కలిసి బండి సంజయ్ విలేకర్లతో మాట్లాడారు. బిహార్‌లో స్వాతహాగా బీజేపీ 92 స్థానాల్లో గెలిచిందన్నారు. ఇక బిహార్‌లో కాంగ్రెస్ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీగా మారిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పని అయిపోయిందని.. ఇక ఆయన పబ్జి ఆడుకోవాలంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు.


జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ గెలుపుపై మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో గెలిచింది ఎంఐఎం అభ్యర్థి అని చెప్పారు. తెలంగాణలో హిందూ సమాజం ఒక్కటి కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నేత ఎవరు అంటూ సందేహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి రాకుండా ప్రధాన ప్రతిపక్ష నేత ఎలా అవుతారంటూ కేసీఆర్‌ను పరోక్షంగా విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో డిపాజిట్ రాకపోయినా వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన సూచించారు.


తెలంగాణ బీజేపీ చీఫ్ రియాక్షన్..

ఎన్డీయేకు బిహార్ ప్రజలు పట్టం కట్టారని టీ బీజేపీ చీఫ్ రామచందర్ రావు తెలిపారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానానికి మాత్రమే పరిమితం అయ్యిందని వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కష్టపడిన కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎంఐఎం మద్దతుతోనే కాంగ్రెస్ గెలిచిందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తం కావాలని సూచించారు.


బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిందన్నారు. హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని గుర్తు చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి బీజేపీ రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజావంచన పాలనపై పోరాటం చేస్తామని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసన సభ పక్షనేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఓట్లు చోరీ చేస్తుందని మండిపడ్డారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలంటూ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఆయన హితవు పలికారు.

Updated Date - Nov 14 , 2025 | 06:32 PM