Hyderabad Rain: హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలో ఏకబిగిన కురుస్తున్న వాన
ABN , Publish Date - Jul 01 , 2025 | 08:27 PM
హైదరాబాద్‌లో ఈ మధ్యాహ్నం నుంచి ఏకబిగిన అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రాజధాని నగరంలో జనజీవనం అస్థవ్యస్థంగా మారింది. పలు ప్రాంతాల్లో డ్రైన్లు పొంగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని జూబ్లీహిల్స్, మణికొండ..
హైదరాబాద్, జూన్ 1: హైదరాబాద్‌లో ఈ మధ్యాహ్నం(మంగళవారం) నుంచి ఏకబిగిన అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రాజధాని నగరంలో జనజీవనం అస్థవ్యస్థంగా మారింది. పలు ప్రాంతాల్లో డ్రైన్లు పొంగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, మణికొండ, బంజారా హిల్స్, పంజాగుట్ట, బల్కంపేట, బేగంపేట్, ఎస్సార్ నగర్, అమీర్ పేట్, కూకట్ పల్లి, గచ్చీబౌలి, టోలీచౌకీ, మెహదీపట్నం, సైనిక్ పురి, సికింద్రాబాద్, వనస్థలిపురం, మియాపూర్, తార్నాక తదితర ప్రాంతాల్లో ఈ మధ్యాహ్నం నుంచీ ఎడతెరిపిలేకుండా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది.
మరోవైపు, హైదరాబాద్ నగరానికి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆకాశం మేఘావృతమై, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని కూడా చెప్పింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, నగరంలో నిన్న సాయంత్రం నుంచి కొన్ని గంటల పాటు అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. అత్యధికంగా బీహెచ్ఈఎల్లో 2.08 సెంటీమీటర్లు, లింగంపల్లి ఎంఎంటీఎస్ పరిధిలో 2.05, షేక్ పేట 1.95, గచ్చిబౌలిలో 1.93 సెంటిమీటర్ల వర్షం పడింది. ఇక, నగరంలో రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం 6.45 సెంటిమీటర్ల నుంచి 11.55 సెంటిమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అటు, తెలంగాణలో రాబోయే ఐదురోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
సినీ నటి పాకీజాకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం
త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర
For More Telangana News and Telugu News