Govt School Teachers Struggle: యాప్‌లతో సరి.. పాఠాలు ఎలా మరి!
ABN , Publish Date - Dec 21 , 2025 | 08:29 AM
విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్ లైన్ యాప్‌లతో ఉపాధ్యాయులు రోజులో రెండు, మూడు పని గంటలను వృథా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో విద్యార్థుల అటెండెన్స్‌ను క్లాస్ టీచర్ తీసుకుని రిజిస్టర్‌లో నమోదు చేసేవారు. అయితే..
ప్రభుత్వ పాఠశాలల్లో గాడితప్పుతున్న విద్య
ఆన్ లైన్ అప్లోడ్ పనులకే పరిమితం
ముందుకు సాగని సిలబస్.. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో బోధనలు కుంటుపడుతున్నాయి. పాఠాలు చెప్పే టీచర్లందరూ ఆన్ లైన్ యాప్‌లకే పరిమితమవుతున్నారు. దీంతో రోజువారీగా క్లాసులు సరిగా జరగక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మెజార్టీ పాఠశాలల్లో సరిపడా టీచర్లు ఉన్నప్పటికీ అదనపు పనుల కారణంగా బోధనలు ముందుకుసాగని పరిస్థితి నెలకొంది.
క్లర్క్‌లు, అసిస్టెంట్లు కరువు
జిల్లాలోని దాదాపు 378 ప్రభుత్వ పాఠశాలల్లో పేపర్, ఆన్ లైన్ వర్క్ చేసేందుకు క్లర్క్‌లు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు కరువయ్యారు. క్లర్క్స్ కొరతతో ఆ పనుల భారం కొంతకాలంగా జిల్లాలోని టీచర్లపై పడుతోంది. రోజులో సగం వరకు యాప్ పనులకే సరిపోతోందని, పిల్లలకు పాఠాలు చెప్పడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని నాంపల్లి మండలంలోని ఓ హైస్కూల్ టీచర్ వాపోయారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటివరకూ పదో తరగతి సిలబస్ 75 శాతం మాత్రమే పూర్తయిందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం యాప్ పని భారాన్ని టీచర్లపై వేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని, లేకుంటే సెల్ ఫోన్లు, ట్యాబ్లతోనే రోజంతా గడపాల్సి వస్తోందని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
రోజులో రెండు, మూడు గంటలు వృథా..
విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్ లైన్ యాప్‌లతో ఉపాధ్యాయులు రోజులో రెండు, మూడు పని గంటలను వృథా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో విద్యార్థుల అటెండెన్స్‌ను క్లాస్ టీచర్ తీసుకుని రిజిస్టర్‌లో నమోదు చేసేవారు. అయితే, ఆ విధానానికి తోడుగా కొన్ని నెలల క్రితం ప్రభుత్వం ఫేస్ రికగ్నైషన్ సిస్టమ్(ఎస్ఆర్ఎస్) యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ప్రతి క్లాస్ టీచర్ విద్యార్థుల హాజరు తీసుకోవడంతోపాటు ట్యాబ్లు, సెల్ ఫోన్ లో ఎస్ఆర్ఎస్ హాజరును కూడా తీసుకుని సదరు యాప్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం క్లాస్ టీచర్ దాదాపు 45 నిమిషాలపాటు కష్టపడాల్సి వస్తోంది.
ఎస్ఆర్ఎస్ సమయంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ తక్కువగా ఉంటుండడంతో ఫొటోలు సరిగా రావడంలేదని టీచర్లు వాపోతున్నారు. రోజూ ఇదే ఇబ్బందులు తలెత్తుతుండడంతో పిల్లలకు సరిగా పాఠాలు చెప్పలేకపోతున్నామని వారు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, ఎస్ఆర్ఎస్ తోపాటు పాఠశాలల్లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారనే కచ్చితమైన వివరాలను తెలుసుకునేందుకు అమలులో ఉన్న యునిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్)తో సతమతమవుతున్నారు. హైస్కూళ్లలో లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (ఎల్బపీ), ప్రాథమిక పాఠశాలల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్)తోపాటు యూడైస్ అప్లోడ్ తోనూ ఇబ్బందులు పడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
HMWS&SB: సమ్మర్‌కు హైదరాబాద్ సిద్ధం: ట్యాంకర్ నెట్‌వర్క్ విస్తరణ
Hyderabad Visit: లోక్‌భవన్‌కు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్