President Droupadi Murmu: ఆధ్యాత్మికతే మానవాళికి దిక్సూచి
ABN , Publish Date - Dec 21 , 2025 | 07:31 AM
మానవాళికి సరైన మార్గాన్ని చూపే దిక్సూచి ఆధ్మాతికతేనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు భారత ఆధ్మాత్మిక వారసత్వంతో పరిష్కారాలు
బ్రహ్మకుమారీస్ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము
హైదరాబాద్/నందిగామ, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మానవాళికి సరైన మార్గాన్ని చూపే దిక్సూచి ఆధ్మాతికతేనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న పర్యావరణ అసమతుల్యత వంటి అనేక సవాళ్లకు భారత ఆధ్మాత్మిక వారసత్వం పరిష్కారాలు చూపిస్తోందని తెలిపారు. ఆధునికత, ఆధ్మాత్మికల సమ్మేళనం భారతదేశ నాగరికతకు గొప్ప బలమని పేర్కొన్నారు. బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ 21వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో శనివారం నిర్వహించిన ‘టైమ్‌లెస్ విజ్డమ్ ఆఫ్ భారత్ - పాత్‌వే్‌స ఆఫ్ పీస్ అండ్ ప్రోగెస్’ సదస్సుకు రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించేందుకు.. ఆధునిక విద్యకు నైతిక విలువలు, విచక్షణ, సృజనాత్మకతకు పర్యావరణ బాధ్యతను అనుసంధానించాలని అన్నారు. కరుణ, సహనం, పరస్పర గౌరవం, సమష్టి బాధ్యత వంటి విలువలు నేటి ఆధునిక ప్రపంచం బలంగా ఉండేందుకు అవసరమని తెలిపారు. అనిశ్చితి అధికమైన నేటి సమాజంలో సామరస్యాన్ని పెంపొందించేందుకు బ్రహ్మకుమారీల తరహా ఆధ్యాత్మిక సంస్థల పాత్ర కీలకమని అన్నారు. బ్రహ్మకుమారీ సంస్థతో తనకు లోతైన అనుబంధం ఉందని చెప్పారు. భారతదేశ భవిష్యత్తు తీర్చిదిద్దడంలో యువత నైపుణ్యాలు, పరిజ్ఞానంతోపాటు వారి నిజాయితీ, లక్ష్యాలు కూడా కీలకమని తెలిపారు. కాగా, బ్రహ్మకుమారీల రాష్ట్ర వ్యాప్త సేవా కార్యక్రమాలైన వ్యాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్, డిజిటల్ వెల్‌నెస్, వయోవృద్ధుల సేవా ప్రాజెక్టులను రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓ మొక్కను నాటారు.