Share News

MLA Raja Singh: బీజేపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు.. రాజా సింగ్ రియాక్షన్

ABN , Publish Date - Sep 08 , 2025 | 09:10 PM

తెలంగాణ బీజేపీ అగ్రనాయకత్వంపై ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్ర బీజేపీ కమిటీని ప్రకటించిన వెంటనే ఆయన తనదైన శైలిలో స్పందించారు.

MLA Raja Singh: బీజేపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు.. రాజా సింగ్ రియాక్షన్
Goshamahal MLA Raja Singh

హైదరాబాద్, సెప్టెంబర్ 08: తెలంగాణ రాష్ట్ర బీజేపీ కమిటీలో గోషా మహల్ నియోజకవర్గానికి చోటు దక్కక పోవడంపై గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్పందించారు. భారతీయ జనతా పార్టీ గౌరవాన్ని గోషా మహల్ నియోజకవర్గానికి చెందిన కార్యకర్త మూడు సార్లు కాపాడారని గుర్తు చేశారు. అలాంటి నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తను రాష్ట్ర కమిటీలో నియమించడానికి మీకు ఏ ఒక్కరూ కనిపించలేదా? అంటూ ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు.


గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ ఒకే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని గెలిచుకుందని గుర్తు చేశారు రాజాసింగ్. అలాంటి గోషామహల్‌లోని బీజేపీ కార్యకర్తలను మరిచిపోయారా? అంటూ పార్టీ అగ్రనాయకత్వానికి చురకలు అంటించారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు బీజేపీ కార్యకర్తలను దూరంగా ఉంచి వారికి అన్యాయం చేస్తారంటూ పార్టీ అగ్రనాయకత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర కమిటీలో 12 మంది సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి నుంచే ఉన్నారని ఈ సందర్భంగా ఆయన వివరించారు. అంటే.. ఇది రాష్ట్ర కమిటీనా? లేకుంటే సికింద్రాబాద్ పార్లమెంట్ కమిటీనా? అనేది అర్థం కావడం లేదంటూ ఎమ్మెల్యే రాజా సింగ్ సందేహం వ్యక్తం చేశారు.


రాష్ట్ర కమిటీని ప్రకటించిన చీఫ్..

కాగా, తెలంగాణ బీజేపీ కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సోమవారం ప్రకటించారు. ఈ కమిటీని 22 మందితో ఏర్పాటు చేశారు. ఏడు మోర్చాలకు రాష్ట్ర అధ్యక్షులను ఈ సందర్భంగా ప్రకటించారు. ఎనిమిది మంది వైస్ ప్రెసిడెంట్లు, ముగ్గురు జనరల్ సెక్రటరీలు, ఏడుగురు సెక్రటరీలు, కోశాధికారులు, సంయుక్త కోశాధికారులు, ముఖ్య అధికార ప్రతినిధిలను నియమించారు.

  • పార్టీ ప్రధాన కార్యదర్శులు: వీరేందర్ గౌడ్, గౌతం రావు, వేముల అశోక్

  • కార్యదర్శులు: ఓ.శ్రీనివాస్ రెడ్డి, కొప్పు బాషా, బండారు విజయలక్ష్మి, స్రవంతి రెడ్డి, పరిణిత, బద్దం మహిపాల్

  • ఉపాధ్యక్షులు: బూర నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, కొల్లి మాధవి, జయశ్రీ, కళ్యాణ్ నాయక్, రఘునాథరావు, బండ కార్తీక రెడ్డి

  • కోశాధికారి: వాసుదేవ్

  • మహిళా మోర్చా అధ్యక్షురాలు: శిల్పా రెడ్డి

  • యువ మోర్చా అధ్యక్షుడు: గణేష్

  • బీసీ మోర్చా అధ్యక్షుడు: ఆనంద్ గౌడ్

  • కిసాన్ మోర్చా అధ్యక్షుడు: లక్ష్మీ నర్సయ్య

  • ఎస్సీ మోర్చా అధ్యక్షుడు: కాంతి కిరణ్

  • ఎస్టీ మోర్చా అధ్యక్షుడు: రవి నాయక్


అయితే ఈ కమిటీలో అత్యధిక సంఖ్యలో పదవులు పొందిన వారు సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని వారే కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ కమిటీ ప్రకటించిన కొన్ని నిమిషాలకే గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. అదీకాక ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. కానీ ఆయన్ని కార్యాలయంలోనికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన రాజా సింగ్.. బీజేపీకి రాజీనామా చేశారు. అదే సమయంలో.. రాష్ట్రంలోని బీజేపీ నేతలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం విదితమే. ఇక రాజా సింగ్ రాజీనామా లేఖను పార్టీ అగ్రనాయకత్వం వెంటనే ఆమోదించిన సంగతి తెలిసిందే.

Updated Date - Sep 08 , 2025 | 09:46 PM