Anjan kumar Yadav: కాంగ్రెస్ అగ్రనేతలకు అంజన్న మాస్ వార్నింగ్
ABN , Publish Date - Feb 24 , 2025 | 07:27 PM
Anjan kumar Yadav: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల వ్యవహార శైలిపై సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి తీరును ఈ సందర్భంగా ఎండగట్టారు. అలాగే వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పినందుకే తెలంగాణలో కుల గణన సర్వే ఈ రేవంత్ ప్రభుత్వం నిర్వహించిందని అంజన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. లేకుంటే వీళ్లు ఈ సర్వేనే చేసే వారు కాదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో అంజన్ కుమార్ యాదవ్ విలేకర్లతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీకి బిహార్ మాజీ సీఎం లూలూ ప్రసాద్ యాదవ్ చెప్పిందకే తనకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కిందని ఆయన పేర్కొన్నారు.
తనకు ఈ పదవి దక్కకుండా చేసేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అడ్డు తగిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కేంద్ర మంత్రి కాకుండా వీళ్లే అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఇక ఎన్నికల్లో ఓడిపోయే సమయంలో తనకు ఎంపీ టికెట్ ఇచ్చారని.. గెలిచే టైంలో మాత్రం తనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా పోటీ చేస్తారని.. మరి జీవన్ రెడ్డి ఒడిపోయాడని.. ఆయనకు ఎంపీగా టిక్కెట్ మళ్లీ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. పక్క పార్టీలోని దానం నాగేందర్‌ను తీసుకు వచ్చి ఎంపీ టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి భజన సంఘాలు వచ్చాయని వ్యంగ్యంగా పేర్కొన్నారు. తమకు ప్రాధాన్యత లేకుంటే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా రేవంత్ సారథ్యంలోని పార్టీలోని కీలక నేతలను అంజన్ కుమార్ యాదవ్ ఈ సందర్భంగా హెచ్చరించారు.
For Telangana News And Telugu News