Share News

Etela Rajender: కాళేశ్వరం విచారణకు హాజరువుతా

ABN , Publish Date - May 21 , 2025 | 10:43 AM

Etela Rajender: కాళేశ్వరం విచారణకు హాజరవుతానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అయితే తనకు ఇంత వరకు నోటీసులు అందలేదన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు.

Etela Rajender: కాళేశ్వరం విచారణకు హాజరువుతా
BJP MP Etela Rajender

హైదరాబాద్, మే 21: కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు వంద శాతం హాజరవుతానని మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అయితే ఇంత వరకు ఎలాంటి నోటీసులు తనకు అందలేదని ఆయన తెలిపారు. అయితే తనకు నోటీసులు పంపిన విషయం మీడియా ద్వారా తెలుసుకున్నానని చెప్పారు. తనకు నోటీసులు అందిన అనంతరం ఈ విషయాన్ని పార్టీలో చర్చించి.. అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా తాను ముందుకు వెళ్తానన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని శామీర్‌పేటలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నీది.. నువ్వు ఎలాంటి విచారణ అయినా చేయి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు.

గతంలో దేవరాయాంజాల్ భూముల విషయంలో కేసీఆర్ చేసిన తప్పే.. నేడు నువ్వు చేస్తున్నావంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఈటల రాజేందర్ మండిపడ్డారు. నువ్వు మమల్ని బెదిరిస్తే భయపడమన్నారు. కేంద్రంలో తమ పార్టీనే అధికారంలో ఉందని ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ గుర్తు చేశారు. నీ చిట్టా అంతా తమ చేతిలో ఉందన్నారు. నీ దిక్కుమాలిన చిల్లర గాళ్ళతో మాట్లాడిస్తే తాను వెనక్కి పోనంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ఈటల ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.


కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ బ్యారేజీని కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించారు. అయితే ఈ బ్యారేజీలోని పలు పిల్లర్లు 2023లో కుంగాయి. ఈ అంశం నాటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాస్త్రంగా మలుచుకుంది. 2024లో ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము అధికారంలోకి వస్తే.. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఈ బ్యారేజీ నిర్మాణంపై విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇక ఆ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది.


అనంతరం ఈ అంశంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పీసీ ఘోష్‌ సారథ్యంలో విచారణ కమిషన్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్‌ విచారణలో భాగంగా పలువురు ఉన్నతాధికారులతోపాటు సిబ్బందిని సైతం ప్రశ్నించింది. అలాగే పలువురు స్వచ్ఛందంగా ఈ విచారణకు హాజరై.. పలు విషయాలను జస్టిస్ పీసీ ఘోష్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌‌తోపాటు ఆయన కేబినెట్‌లో మంత్రులుగా వ్యవహరించిన హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు కమిషన్ నోటీసులు జారీ చేసింది.


జూన్ 5వ తేదీన కేసీఆర్, జూన్ 6వ తేదీన హరీశ్ రావు.. అలాగే జూన్ 9వ తేదీన ఈటల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కావాలని ఆ నోటీసుల్లో కమిషన్ స్పష్టం చేసింది. కేసీఆర్ కేబినెట్‌లో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ పని చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాలపరిమితి ఇటివల ముగిసింది. అయితే మరో రెండు నెలలు పొడిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ విచారణకు సంబంధించిన నివేదిక దాదాపుగా సిద్దమైందని తెలుస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం

Road Accident: డీసీఎంను ఢీకొట్టిన కారు.. ముగ్గురు స్పాట్ డెడ్..

For Telangana News And Telugu News

Updated Date - May 21 , 2025 | 10:44 AM