Share News

Dil Raju: పవన్‌ సినిమా రిలీజ్‌‌ను అడ్డుకునే దమ్ము, ధైర్యం ఎవరూ చేయరు

ABN , Publish Date - May 26 , 2025 | 04:19 PM

పవన్‌ కల్యాణ్ సినిమా రిలీజ్‌ అవుతుందని ప్రస్తుతం సబ్జెక్ట్‌ డైవర్ట్‌ అయ్యిందని నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. పవన్‌ కల్యాణ్ సినిమా రిలీజ్‌ను అడ్డుకునే దమ్ము, ధైర్యం ఎవరూ చేయరని ఆయన స్పష్టం చేశారు.

Dil Raju: పవన్‌ సినిమా రిలీజ్‌‌ను అడ్డుకునే దమ్ము, ధైర్యం ఎవరూ చేయరు
Tollywood producer Dil Raju

హైదరాబాద్, మే 26: టాలీవుడ్ సినీ పరిశ్రమకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమని ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. ఈ రెండు ప్రభుత్వాలను కలుపుకుని తాము ముందుకెళ్తామన్నారు. సినిమా ఇండస్ట్రీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంతా కాదని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్మాత దిల్ రాజ్ విలేకర్లతో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలోని వివాదాలను యూనిటీగా పరిష్కరించుకోవాలని సూచించారు. సమస్యలపై నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో కలిపి కమిటీ వేస్తామని చెప్పారు. ప్రభుత్వం దృష్టికి అన్ని అంశాలు తీసుకు వెళ్తామని ఆయన వెల్లడించారు. తెలంగాణలో 30, ఉత్తరాంధ్రలో 20 లీజ్ థియేటర్లు తనకు ఉన్నాయని వివరించారు.


అసలు గొడవ అప్పుడే మొదలైంది..

ఏప్రిల్ 19వ తేదీన అసలు థియేటర్ల గొడవ మొదలైందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో స్థానిక ఎగ్జిబిటర్లు.. తమ ఇబ్బందులపై సమావేశం పెట్టారని వివరించారు. పర్సంటేజ్‌ విధానం కావాలని వారు డిమాండ్ చేశారని గుర్తు చేశారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు - ఎగ్జిబిటర్లు మధ్య వివాదం తలెత్తిందని చెప్పారు. ఏప్రిల్‌ 26వ తేదీన ఈ వివాదం తమ దృష్టికి వచ్చిందన్నారు. సినిమా రిలీజ్‌ చేస్తే ఫస్ట్‌ వీక్‌ రెంట్‌.. సెకండ్‌ వీక్‌ నుంచి పర్సంటేజ్‌ అమల్లో ఉందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. దీంతో ఈ వివాదం తూర్పు గోదావరి జిల్లా నుంచే మొదలైందని దిల్ రాజు పేర్కొన్నారు.


అయితే మే 18వ తేదీన ఒక సమావేశం నిర్వహించాలని తాము అనుకున్నామన్నారు. ఎగ్జిబిటర్ల సమస్యను నిర్మాతల దృష్టికి తీసుకెళ్లాలని కోరానని తెలిపారు. కానీ థియేటర్ల మూసివేత అంశాన్ని మాత్రం ప్రతిపాదించ వద్దని వారికి చెప్పానని గుర్తు చేశారు. కానీ ఛాంబర్‌కు ఎగ్జిబిటర్లు లేఖ ఇచ్చారని చెప్పారు. అందులో తమ సమస్యలు పరిష్కరించకపోతే.. థియేటర్లు మూసివేస్తామని వారు ఆ లేఖలో ప్రస్తావించారని వివరించారు.


అప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదేనన్నారు. ఇక ఎగ్జిబిటర్లతో డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరిగిందని తెలిపారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా తమ సమస్యలు చెప్పారని తెలిపారు. సినిమాలు విడుదలవుతున్నాయి.. థియేటర్ల మూసివేత నిర్ణయం వద్దన్నారని చెప్పారు. ఇప్పటి వరకు జరిగింది ఇదేనని దిల్ రాజు స్పష్టం చేశారు.


అయితే పవన్‌ కల్యాణ్ సినిమా రిలీజ్‌ అవుతుందని ప్రస్తుతం సబ్జెక్ట్‌ డైవర్ట్‌ అయ్యిందని.. అయినా పవన్‌ సినిమా రిలీజ్‌ను అడ్డుకునే దమ్ము, ధైర్యం ఎవరూ చేయరన్నారు. కానీ మధ్యలో రాంగ్‌ కమ్యూనికేషన్‌ జరిగిందని పేర్కొన్నారు. మంత్రి కందుల దుర్గేష్‌ తనతో మాట్లాడారన్నారు.


థియేటర్ల మూసివేత ఉండదని ఆయనతో తాను స్పష్టం చేశానని తెలిపారు. మిస్‌ కమ్యూనికేషన్‌ వల్లే ప్రస్తుతం వివాదం నెలకొందన్నారు. జూన్‌ 11వ తేదీన కమల్‌హాసన్‌, 12వ తేదీన పవన్‌..20వ తేదీన కుబేరా సినిమాల రిలీజ్‌లు కాబోతున్నాయన్నారు. అలాగే జులై, ఆగస్టులోనూ చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా దిల్‌ రాజు వివరించారు.

ఇవి కూడా చదవండి..

పాక్‌తో గూఢచర్యం.. సీఆర్‌పీఎఫ్ జవానును అరెస్టు చేసిన ఎన్ఐఏ నైరుతీ రుతుపవనాల ప్రభావం.. దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 26 , 2025 | 05:03 PM